YSRCP: కన్నా పార్టీ మార్పు అలజడి..ఏదో చేద్దాం అనుకుంటే మరేదో జరిగిందన్నట్లు పరిస్థితి..!?

ABN , First Publish Date - 2023-02-28T12:59:36+05:30 IST

నేటి రాజకీయాల్లో పార్టీల మార్పు సర్వసాధారణం. ఒక పార్టీలో ఉన్నప్పుడు.. వ్యతిరేక పార్టీలపై విమర్శలు చేయడం సహజం. కానీ.. ఇప్పుడు అదే అంశాన్ని

YSRCP: కన్నా పార్టీ మార్పు అలజడి..ఏదో చేద్దాం అనుకుంటే మరేదో జరిగిందన్నట్లు పరిస్థితి..!?

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పు వైపీసీలో అలజడి రేపింది. కన్నా టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేసిన అధికార పార్టీ నేతలు.. అభాసుపాలయ్యారు. ప్రధానంగా.. కన్నా పార్టీ మార్పుపై మాట్లాడి.. ఇద్దరు వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. ఇంతకీ... ఎవరా ఇద్దరు నేతలు?.. కన్నా పార్టీ మార్పు వ్యవహారం.. వైసీపీలో ఎందుకు అలజడి రేపుతోంది?.. మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-26545.jpg

5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు

నేటి రాజకీయాల్లో పార్టీల మార్పు సర్వసాధారణం. ఒక పార్టీలో ఉన్నప్పుడు.. వ్యతిరేక పార్టీలపై విమర్శలు చేయడం సహజం. కానీ.. ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుని వైసీపీ నేతలు పరువు పోగొట్టుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్‌ తెరపైకి తీసుకొచ్చి మీడియా ముందు అడ్డంగా బుక్కయ్యారు. నిజానికి.. కన్నా లక్ష్మీనారాయణ.. మోస్ట్‌ సీనియర్‌ లీడర్‌. కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలువురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పని చేసారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే.. విభజన తర్వాత.. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కన్నా.. ఆ పార్టీకి ఏపీ చీఫ్‌ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షులుగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Untitled-24554.jpg

ఏ మొహం పెట్టుకుని టీడీపీలో చేరారని ప్రశ్నించడం

ఇదిలావుంటే... బీజేపీలోని కొందరి నేతల తీరు నచ్చక.. కన్నా లక్ష్మీనారాయణ కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి.. టీడీపీలో చేరారు. అయితే.. కన్నా టీడీపీలో చేరడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం పెట్టించిన వైసీపీ పెద్దలు.. మరో అడుగు ముందుకేసి.. కన్నా నివాస ప్రాంతంలో వంగవీటి మోహన్‌రంగా విగ్రహం దగ్గర నిరసన చేశారు. రంగా విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌తోపాటు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు హాజరయ్యారు. అక్కడే.. వైసీపీ నేతలకు అసలు సమస్య వచ్చి పడింది. మీడియాతో మాట్లాడిన అధికార పార్టీ నేతలు.. రాజకీయంగా చిక్కుల్లో పడ్డారు. కన్నా టీడీపీలో చేరికతో రంగా ‌ఆత్మ క్షోభిస్తుందని వైసీపీ నేతలు ఆరోపించారు. గతంలో టీడీపీని, చంద్రబాబును తిట్టిన కన్నా.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీలో చేరారని ప్రశ్నించడం విమర్శలకు తావిస్తోంది.

Untitled-23545.jpg

ఏ మొహం పెట్టుకుని ఫ్యాన్‌ పార్టీలో చేరారు?

ఇక.. వైసీపీలోని పలువురు కీలక నేతలను ప్రస్తావిస్తూ.. మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు.. గతంలో జగన్‌రెడ్డి, వైసీపీని తిట్టలేదా అని ప్రశ్నించారు. వైసీపీని, ఆ పార్టీ అధినేతను తిట్టినవారు.. ఇప్పుడు మంత్రులుగా రాజ్యం ఏలడం లేదా?.. వాళ్లు ఏ మొహం పెట్టుకుని ఫ్యాన్‌ పార్టీలో చేరారని క్వశ్చన్‌ చేశారు. అదే సమయంలో.. నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దాలి గిరి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌.. గత ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డిని, వైసీపీని తిట్టారు కదా.. వారిని ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేయడంతో.. ఆయా నేతలు ఖంగుతిన్నంత పని అయింది.

Untitled-2754.jpg

ఏదో చేద్దాం అనుకుంటే మరేదో జరిగింది!

వాస్తవానికి.. మద్దాలి గిరి.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. వైసీపీలోకి వెళ్లారు. అలాగే.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా.. టీడీపీ నుంచే వైసీపీలో చేరారు. దాంతో.. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడాన్ని తప్పుపట్టిన వైసీపీ నేతలకు మీడియా చెమటలు పట్టించింది. కన్నాను విమర్శించి తాడేపల్లి పెద్దల దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నించగా.. రివర్స్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఇక.. మీడియా అడిగిన ప్రశ్నలతో వైసీపీ నేతలంతా కిక్కురుమనకుండా జారుకున్నట్లు తెలుస్తోంది. ఆయా పరిణామాలతో మద్దాలి గిరి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు అనవసరంగా కార్యక్రమానికి వచ్చామని భావించారు. ఏదో చేద్దాం అనుకుంటే.. మరేదో జరిగిందని వైసీపీ నేతలు తెగ ఫీల్‌ అయిపోతున్నారు. కన్నాపై వైరంతో కావటి మనోహర్ చేపట్టిన కార్యక్రమానికి వెళ్లి పరువు పోగొట్టుకున్నామని బాధపడిపోతున్నారు.

Untitled-285.jpg

మొత్తంగా.. కన్నా లక్ష్మీనారాయణ విషయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు.. వారికే బెడిసి కొట్టింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కన్నాను ప్రశ్నించి.. అభాసుపాలైన వైసీపీ నేతలు.. ఆ డ్యామేజ్‌ను ఎలా కవర్‌ చేసుకుంటారో చూడాలి మరి.

Updated Date - 2023-02-28T12:59:36+05:30 IST