Kanna Joined TDP : కన్నా టీడీపీలో చేరిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారా.. ఆయనకు ఇచ్చిన హామీ ఇదేనా.. !?
ABN , First Publish Date - 2023-02-23T18:53:50+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణకు (Kanna Lakshminarayana ) అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించిందా..?
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణకు (Kanna Lakshminarayana ) అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించిందా..? పార్టీలో చేరతారనే సంకేతాలు రాగానే కన్నాకు ఫలానా బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారా..? ఆయనకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసుకునే వస్తే అధికారంలోకి రాగానే కీలక పదవి ఇస్తానని బాబు హామీ కూడా ఇచ్చారా..? అంటే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ కన్నాకు బాబు అప్పగించిన బాధ్యతలేంటి, హామీ ఏంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఇదీ అసలు కథ..
వేలాది మంది అనుచరులు, కార్యకర్తలతో తరలివచ్చిన కన్నా లక్ష్మీ నారాయణ.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కన్నా టీడీపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందనే విషయంపై ఇదే చేరిక సభలోనే చంద్రబాబు క్లియర్‌గా చెప్పారు. ఇదంతా ఒక ఎత్తయితే.. కన్నాకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ వీరాభిమానులు కొందరూ ఫేస్‌బుక్ (Facebook), ట్విట్టర్‌లో (Twitter) ఇదిగో కన్నాకు ఫలానా బాధ్యతలు అప్పగించారని వినికిడి అంటూ పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నాకు మంచి పేరుంది.. అంతకుమించి పరిచయాలు కూడా ఉన్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీచేసినా సునాయసంగా గెలిచేస్తారని కన్నా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే జిల్లాలో కీలక నియోజకవర్గాలైన పెదకూరపాడు (Pedakurapadu), సత్తెనపల్లిలో (Sattenapalle) టీడీపీని గెలిపించే బాధ్యతను కన్నాకు చంద్రబాబు అప్పగించారని టాక్ నడుస్తోంది. దీంతో పాటు.. అయితే ఆయన్ను ఎక్కడ్నుంచి బరిలోకి దింపాలనే దానిపై త్వరలోనే అధిష్టానం నిర్ణయం తీసుకోనుందట. అయితే ఆయన్ను ఎంపీగా పోటీలోకి దింపుతారా..? లేకుంటే ఎమ్మెల్యేగానే బరిలోకి దింపుతారా..? అనేదానిపై త్వరలోనే క్లారిటీ రానుందట.
పెద్ద విషయమేమీ కాదట..
వాస్తవానికి చంద్రబాబు అప్పగించిన ఈ రెండు నియోజకవర్గాల బాధ్యత కన్నాకు పెద్ద విషయమే కాదని ఆయన అత్యంత సన్నిహితులు చెప్పుకుంటున్నారట. ఎందుకంటే.. పెదకూరపాడు నియోజకవర్గం కన్నా అడ్డా. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కన్నా 1989, 1994, 1999, 2004 ఇలా మొత్తం నాలుగుసార్లు వరుసగా గెలిచి రికార్డ్ సృష్టించారు. కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్నప్పుడు పలు శాఖలకు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. నాటికి నేటికి ఆయన హవా నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ్నుంచి కన్నా పోటీచేసినా.. టీడీపీ తరఫున మరెవరు పోటీచేసినా అవలీలగా గెలిచేస్తారట. ఇక మిగిలిన సత్తెనపల్లి విషయానికొస్తే.. ఈ నియోజకవర్గం దివంగత కోడెల శివప్రసాద్ అడ్డా (Kodela Shivaprasad). ఇక్కడ టీడీపీకి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో కోడెలపై వైసీపీ (Ysr Congress) తరఫున పోటీచేసిన అంబటి రాంబాబు (Ambati Rambabu) కేవలం 20,876 ఓట్ల మెజార్టీతో గెలవగలిగారు. కోడెల చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు శివరామ్ (Kodela Sivaram) ప్రజల్లో తిరుగుతూ కార్యకర్తలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలకు ఎప్పుడేం అవసరమొచ్చినా శివరామ్ ఆదుకుంటున్నారు. శివరామ్‌కు కన్నా అనుభవం, పరిచయాలు తోడైతే కచ్చితంగా టీడీపీకి తిరుగుండదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట.
కన్నా పోటీ ఇక్కడేనా..!
ఇవన్నీ ఒక ఎత్తయితే రానున్న ఎన్నికల్లో కన్నా కచ్చితంగా పోటీ చేస్తారని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్లు చెబుతున్న మాట. ఈయన మనసులో పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాలు ఉన్నాయట. ఈ రెండింటిలో చంద్రబాబు పోటీ చేయమని చెప్పినా.. ఇవి కాకుండా మరో నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి కన్నా సిద్ధంగానే ఉన్నారట. అయితే సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు కన్నానే సరైన అభ్యర్థి అని ఇక్కడ్నుంచి బరిలోకి దింపొచ్చని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇది జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. కన్నాను సత్తెనపల్లికి పంపి.. టీడీపీ అధికారంలోకి వచ్చాక శివరామ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వొచ్చనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.
మొత్తానికి చూస్తే.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి కన్నా పోటీ చేసినా, చేయకున్నా పక్కాగా టీడీపీనే గెలుస్తుందని పార్టీ శ్రేణులు ధీమాగా చెప్పుకుంటున్నాయట. ఒకవేళ కన్నా పోటీ చేసి గెలిచి.. టీడీపీ అధికారంలోకి వస్తే ఇక ఏ మాత్రం ఆలోచించకుండానే మంత్రి పదవికి దక్కుతుందని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలోకి రాగానే.. కన్నాకు మంత్రి (Minister) పదవి ఇస్తానని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారని ఇన్‌సైడ్ టాక్. కన్నా చేరిన కొన్ని గంటల్లోనే ఈ రేంజ్‌లో వస్తున్న రూమర్స్‌లో (Rumours) నిజానిజాలెంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.