Karnataka Elections 2023: కన్నడ కోటపై మళ్లీ కాషాయం ఎగిరేనా?
ABN , First Publish Date - 2023-03-29T19:02:03+05:30 IST
దేశంలో ఏకైక 'పాన్ ఇండియా పార్టీ' బీజేపీ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే కర్ణాటక ఎన్నికల..
బెంగళూరు: దేశంలో ఏకైక 'పాన్ ఇండియా పార్టీ' (Pan India Party) బీజేపీ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) నగారా మోగింది. నాలుగు దశాబ్దాల్లో ఇద్దరు ఎంపీల స్థాయి నుంచి 303 ఎంపీలకు ఎదిగిన ఏకైక పార్టీగా బీజేపీ దేశవ్యాప్తంగా సత్తా చాటుకున్నప్పటికీ, దక్షిణాదిన బీజేపీ పాలనలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సైతం గట్టిపోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉండగా, జేడీఎస్ తన ఉనికి చాటుకునేందుకు పట్టుదలగా ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలో 'కమిషన్ల పాలన' నడుస్తోందంటూ కాంగ్రెస్ విసుగూవిరామం లేకుండా కొద్దికాలంగా సాగిస్తున్న పోరాటం కూడా బీజేపీపై ఎంతోకొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో బీజేపీ పలు సవాళ్ల మధ్య మరోసారి అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందా? అనేది కన్నడనాట చర్చనీయాంశమవుతోంది.
2018లో హంగ్...
కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. హంగ్ అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. 104 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సంఖ్యాబలం లేకపోవడంతో 37 సీట్లు గెలిచిన జేడీఎస్ 80 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అనంతర పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కుమారస్వామి ముఖ్యమంత్రి అ్యయారు. అయితే 2019 జూలైలో ఇరుపార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ గూటిలో చేరడంతో కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. 2021లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడంతో బొమ్మై సీఎంగా పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం అధికార బీజేపీలో 121 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌లో 70, జేడీఎస్‌లో 30 మంది ఎమ్మెల్యేలున్నారు.
ప్రధాన పార్టీల వ్యూహాలు, సవాళ్లు...
ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించగానే మళ్లీ కమల వికాసం తథ్యమని ముఖ్యమంత్రి బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర జనాభాలో 40 శాతంగా ఉన్న లింగాయత్‌లు, వొక్కలిగ వర్గాల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ కొంతకాలంగా గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇటీవలనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసి ఈ రెండు సామాజిక వర్గాలకు రిజర్వేషన్ పెంచడం ద్వారా వారిని అక్కున చేర్చుకునేందుకు గట్టి పావులు కదిపింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇవ్వగా, దానినే ఇప్పుడు బీజేపీ రద్దు చేసింది. మరోవైపు అవినీతి, కమ్యూనల్ పోలరైజేషన్ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర సర్కార్ ఇటీవల కాలంలో ఎదుర్కొంటోంది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలేనంటూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొట్టివేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ, రాష్ట, జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలపై రాష్ట్ర బీజేపీ గట్టి నమ్మకం పెట్టుకుంది. మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఇవి పార్టీ ప్రధాన ఆయుధాలని బలంగా నమ్ముతోంది.
అవినీతిపై పోరే కాంగ్రెస్ ప్రధానాస్త్రం
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, 40 శాతం కమిషన్ల ప్రభుత్వం ఇదని కాంగ్రెస్ గత కొంతకాలంగా బీజేపీని ఎండగడుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. మోదీ చేష్టలుడిగి చూస్తున్నారని ఆరోపిస్తోంది. యువత నిరుద్యోగ సమస్యతో అల్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రచారం సాగిస్తోంది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల పాటు నెలనెలా రూ.3,000 సాయం చేస్తామని హామీలిస్తోంది. గణనీయంగా ఓటర్లుగా నమోదైన వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, దళితుల ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తోంది. ఈసారి అధికారం తమదేనంటూ ఈసీ ఎన్నికల ప్రకటన వెలువడగానే కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఢంకా బజాయించారు.
కింగ్ మేకర్ పాత్రలో జేడీఎస్...
కర్ణాటక రాజకీయాల్లో కింగ్‌మేకర్ పాత్రను జేడీఎస్ పోషిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరంగా ఉంటూ, ఎన్నికల అనంతర పొత్తు అవకాశాలను పదిలం చేసుకుంటోంది. ప్రధానంగా రైతు సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి అంశాలపైనే జేడీఎస్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. మొత్తం మీద, కర్ణాటకలో త్రిముఖ పోటీ రసవత్తరంగా ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవినీతి, పోలరైజేషన్, సహంగానే అధికారంలో ఉంటే పార్టీకి ఎదురయ్యే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి సవాళ్లు కానుండగా, కాంగ్రెస్‌లో సీఎం పదవిని ఆశిస్తున్న నేతలు ఎక్కువగా ఉండటంతో కలిసికట్టుగా నేతలు పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏకపక్షంగా ఓటర్లు తమవైపే ఉన్నారని జేడీఎస్ చెబుతున్నా...షరామామూలుగానే జేడీఎస్ కింగ్‌మేకర్ పాత్రకే పరిమితం కావచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తిరిగి 'హంగ్' తీర్పు ఇస్తారా? స్పష్టమైన మెజారిటీతో ఏదో ఒక పార్టీకి అధికారం అప్పగిస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.