Karnataka Elections: అదే గానీ జరిగితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మస్తు మజా సీన్ గ్యారెంటీ..!

ABN , First Publish Date - 2023-03-27T14:35:06+05:30 IST

కర్ణాటక(Karnataka)లో మరో నెలన్నరలోగా ఎన్నికలు జరగనుండడంతో.. రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

Karnataka Elections: అదే గానీ జరిగితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మస్తు మజా సీన్ గ్యారెంటీ..!

కర్ణాటక(Karnataka)లో మరో నెలన్నరలోగా ఎన్నికలు జరగనుండడంతో.. రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ(Congress) ఇప్పటికే 224 స్థానాలకు గాను.. 124 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ(BJP) పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ.. ఆచితూచి అడుగులు వేస్తోంది. కన్నడనాట బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్(JDS) బలమైన మైత్రి కోసం చర్చలను ప్రారంభించింది.

kcr-1.jpg

బీఆర్ఎస్ ఫుల్ సపోర్ట్..

2018 కర్ణాటక ఎన్నికల సమయంలోనే జేడీఎస్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌(KCR)కు దగ్గరి సంబంధాలున్న విషయం స్పష్టమైంది. అప్పట్లో ఎన్నికల ప్రచారం పీక్‌లో ఉన్న సందర్భంలో.. జేడీఎస్ కొంత వెనకంజ వేస్తున్నట్లు గుర్తించగానే.. సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లి, దేవెగౌడ(Deve Gowda), కుమారస్వామికి ధైర్యం చెప్పారు. అయితే.. ఇంతకాలం బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో తన భవిష్యత్‌ను పరీక్షించుకునేందుకు కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తుందని విశ్లేషకులు భావించినా.. తాజాగా ఆ పార్టీ పోటీకి దూరమేనని ప్రకటించింది. అయితే.. బీఆర్ఎస్‌కు ఇప్పుడిప్పుడే క్యాడర్ పెరుగుతున్న హైదరాబాద్-కర్ణాటక(Hyderabad-Karnataka, Kalyan-Karnataka), ముంబై-కర్ణాటక(Mumbai-Karnataka)ల్లో తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తామని బీఆర్ఎస్ వర్గాలు చూచాయగా చెప్పాయి. అంటే.. బళ్లారి(Bellary), సింధనూర్(Sindhanur), రాయచూర్(Raichur), కొప్పాల్(Koppel) వంటి ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు అధికంగా ఉన్నారు. బీదర్(Bidar), గుల్బర్గా(కలబుర్గి) వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్‌కు మద్దతుంది. అంటే.. హైదరాబాద్-కర్ణాటకలోని 31 నియోజకవర్గాలలతోపాటు.. ముంబై-కర్ణాటకలోని 50 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు.. మంత్రులు, ఎంపీలు ప్రచారం చేసే అవకాశాలున్నాయి.

10141.jpg

రంగంలోకి తృణమూల్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి మమతాబెనర్జీ(Mamta Benarji) కూడా జేడీఎస్‌కు మద్దతు పలికారు. ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీ ఓటమే ధ్యేయంగా ఆమె జేడీఎస్ తరఫున ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయి. లౌకికవాదం(Secularism) కోసం పనిచేసే జేడీఎస్‌ను సహజ మిత్రపక్షంగా(Natural Alliance) పేర్కొంటూ టీఎంసీ, బీఆర్ఎస్ భావిస్తున్నాయి. కుమారస్వామి గత వారం కోల్‌కతాలో మమతాబెనర్జీని మర్యాదపూర్వకంగా కలిసి.. ఆమె మద్దతును కోరారు. కర్ణాటకలో జేడీఎస్ తరఫున ప్రచారం చేయాలంటూ ఆయన చేసిన అభ్యర్థనకు మమత అంగీకారం తెలిపారు. షెడ్యూల్‌ను పంపితే.. తాను ప్రచారానికి సిద్ధమని ఆమె కుమారస్వామికి హామీ ఇచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మమతాబెనర్జీ కోల్‌కతా(Kolkatta)లో విపక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి కుమారస్వామి హాజరయ్యారు. జేడీఎస్, బీఆర్ఎస్, టీఎంసీల ప్రధాన లక్ష్యం కర్ణాటకలో బీజేపీని గద్దెదించడమే కావడంతో.. అంతా కలిసికట్టుగా పనిచేస్తారని స్పష్టమవుతోంది. ఈ అంచనాల నేపథ్యంలో.. మాజీ ప్రధాని దేవెగౌడ ఆదివారం కర్ణాటకలో విలేకరులతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో జేడీఎస్‌కే అధికార పగ్గాలు దక్కుతాయని, కుమారస్వామి సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. 123 స్థానాల్లో విజయఢంకా మోగిస్తామన్నారు.

kumaraswamy.jpg

కుమార స్వామి ముందు సవాళ్లెన్నో..

వ్యూహాలు-ప్రతివ్యూహాలు, మిత్రపక్షాలు-వైరివర్గాలు.. ఇలా ఎన్ని అంచనాలు వేసుకున్నా.. ఈ సారి కన్నడనాట ఎన్నికల పోరు కొంత కఠినంగానే ఉంటుందని స్పష్టమవుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ, మళ్లీ కర్ణాటకలో పాగా వేసేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. పైగా.. రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటుతో కాంగ్రెస్ వైపు సానుభూతి పవనాలు వీచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జేడీఎస్‌లో 2018 నాటి ఎన్నికల సమయంలో ఉన్నంత వేడి కనిపించడంలేదనే విమర్శలు ఉన్నాయి. అభ్యర్థుల ప్రకటన అనేది కుమారస్వామికి పెద్ద సవాలు అని, కీలక నియోజకవర్గాల నుంచి ఒకరికంటే ఎక్కువ మంది ఉద్ధండులు ఆశావహ జాబితాలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒంటరిగానే పోటీకి వెళ్తుండడం మాత్రం జేడీఎస్‌కు కలిసివచ్చే అంశమంటున్నారు.

Updated Date - 2023-03-27T14:52:29+05:30 IST