Skill Case : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. దసరా సెలవుల్లోనే...!!
ABN , First Publish Date - 2023-10-19T16:26:43+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ (AP CID) నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) కీలక పరిణామం చోటుచేసుకుంది..!
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ (AP CID) నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. స్కిల్ కేసులో (Skill Case) బెయిల్ పిటిషన్‌పై (Bail Petition) వాయిదా వేసిన ఏపీ హైకోర్టు (AP High Court) .. అనంతరం ఈ విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బెయిల్ పిటిషన్‌పై దసరా సెలవుల్లోనే (Dussehra Holidays) వెకేషన్ బెంచ్ విచారిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతకుముందు.. చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై విచారణను వెకేషన్ బెంచ్‌కు వేయాలని.. బాబు తరఫున తరపు న్యాయవాదులు కోరారు. వాదనల అనంతరం ఈ విజ్ఞప్తిపై పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. అనంతరం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సంబంధించిన నివేదికను వెకేషన్ బెంచ్‌కు ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అనంతరం బాబు ఆరోగ్య పరిస్థితి పైనా దాఖలైన ఐఏ పిటిషన్ విచారణ కూడా వెకేషన్ బెంచ్‌లో చేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
లూథ్రా ఏం మాట్లాడారు..?
బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో జరిగిన విచారణలో చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra) వర్చువల్‌గా పాల్గొన్నారు. బాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టు లూథ్రా కోరారు. అంతేకాదు.. ఈ స్కిల్ కేసులో ఇతర నిందితులు బెయిల్‌పై ఉన్నారన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి లాయర్ తీసుకెళ్లారు. పైగా.. 40 రోజులుగా ఈ కేసులో దర్యాప్తు చేయగా ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని మరోసారి న్యాయమూర్తికి లాయర్‌కు నిశితంగా వివరించారు. అయితే.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నారు..? అనే విషయం తెలుసుకునేందుకు మధ్యాహ్నం వరకూ సమయం ఇవ్వాలని హైకోర్టును సీఐడీ తరఫు లాయర్ కోరారు. ఇదంతా ఉదయం జరగ్గా.. మధ్యాహ్నం మరోసారి వాదనలు విన్న న్యాయస్థానం అనంతరం విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ములాఖత్‌పై ఇలా..!
ఇదిలా ఉంటే.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ విషయంపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెంట్రల్ జైల్‌లో ములాఖత్‌లు పెంచాలని బాబు తరఫు న్యాయవాదులు కోరారు. లీగల్ ములాఖత్ రోజుకూ మూడు సార్లు ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో వరుసగా దాఖలు అవుతున్న పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో న్యాయవాదులు రాసుకొచ్చారు. అంతేకాదు.. ములాఖత్ విషయంలో జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా పిటిషన్‌లో చంద్రబాబు తరఫు లాయర్లు వివరించారు. అయితే ములాఖత్ విషయం ఇప్పటికిపుడు విచారణ సాధ్యంకాదన్న ఏసీబీ కోర్టు.. దీనిపై కౌంటర్ వేయాలని సీఐడీ తరపు న్యాయవాదులను ఆదేశించింది.