Kurnool District: ఎమ్మెల్సీ ఎన్నికల హీట్..సీటు కోసం సీనియర్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు..!
ABN , First Publish Date - 2023-03-06T11:07:31+05:30 IST
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీలో కొత్త చిచ్చు రేపింది. ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్లు కళ్లు కాయలు
కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి. వైసీపీ అధిష్టానం ఒకటి తలిస్తే మరొకటి జరిగింది. పార్టీ పెద్దలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. సీనియర్లను కాదని కొత్తవారికి టికెట్ ఇవ్వడం తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎప్పటినుంచో ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల అడియాశలు అయ్యాయి. ఇప్పుడు అదే ఆశావహులు.. సొంత పార్టీకి రివర్స్ అవుతుండడం ఆసక్తిరేపుతోంది. ఇంతకీ... కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో.. వైసీపీ ఏమనుకుంది?.. అసలేం.. జరిగింది?...అనే మరిన్ని విషయాలే ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
టికెట్ ఇవ్వడంపై మిగతా వర్గాల అభ్యంతరం
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీలో కొత్త చిచ్చు రేపింది. ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అత్యధికులు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 1,178 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,022 మంది వైసీపీ వారే ఉన్నారు. అయితే.. ప్రతిపక్ష టీడీపీకి సంఖ్యా బలం లేకపోవడంతో పోటీ ఉండదు. ఫలితంగా.. ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వొచ్చని సీనియర్ నేతలు భావించి టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. వైసీపీ అధిష్టానం రెడ్డి సామాజికవర్గ ఆశావహులను కాదని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది.
ఆదోనికి చెందిన డాక్టర్ మధుసూదన్‌కు సీఎం జగన్ కర్నూలు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. కర్నూలు పార్లమెంట్‌లో వాల్మీకి సామాజికవర్గం బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో చాలా ప్లస్ అవుతుందనే భావనతో అధిష్టానం నిర్ణయం తీసుకొని ఉండొచ్చని కొందరు జిల్లా నేతలు అభిప్రాయ పడుతున్నారు. దానికి తగ్గట్లే.. మధుసూదన్‌కు టికెట్ ఇవ్వడంపై వాల్మీకి సామాజికవర్గం ఆనంద వ్యక్తం చేస్తోంది. అయితే.. బీసీల్లో ఒక్క వాల్మీకి సామాజికవర్గం మినహాయించి మిగతా వర్గాలు ఆయనకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీలు అంటే ఒక్క వాల్మీకిలేనా.. ముఖ్యమైన పదవులు వారికే ఇస్తారా.. మిగతా సామాజిక వర్గాలు వైసీపీకి కనబడడం లేదా అని బీసీల్లోని కొన్ని సామాజికవర్గాలకు చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు.
సైలెంట్‌గా ఓ రేంజ్‌లో చెక్ పెట్టినట్లు ప్రచారం
మరోవైపు... డాక్టర్ మధుసూదన్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లలో 90శాతం మందికి తెలియని వ్యక్తి. అలాంటప్పుడు ఆయనకు ఎవరు ఓటేస్తారని నంద్యాలకు చెందిన కొందరు వైసీపీ శ్రేణులు బాహాటంగానే చెప్తుండడం చర్చగా మారుతోంది. నంద్యాల జిల్లా రెడ్డి సామాజికవర్గం నేతలయితే జగన్‌రెడ్డి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మధుసూదన్ నామినేషన్ కార్యక్రమానికి నంద్యాల జిల్లా వైసీపీ నేతలు వెళ్లలేదనే టాక్ నడుస్తోంది.
అటు.. కర్నూలు జిల్లాకు చెందిన నేతలు కూడా గరంగరంగా ఉన్నారు. వారు కూడా మధుసూదన్ నామినేషన్ కార్యక్రమానికి రామని నేరుగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ విషయాన్ని మధుసూదన్ వర్గం అధిష్టానానికి చేర వేసింది. దాంతో.. వైసీపీ పెద్దలు.. నామినేషన్ కార్యక్రమానికి వెళ్లని వారిని ఆరా తీసి సీరియస్ అయ్యారు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా డోంట్ కేర్.. సంఖ్యా బలం.. అధిష్టానం అండ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేసి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని మధుసూదన్ వర్గం నేతలు భావిస్తున్నారు. అయితే.. వారి ప్లాన్‌ను అసమ్మతి వర్గం నేతలు పసిగట్టి.. సైలెంట్‌గా ఓ రేంజ్‌లో చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
కొంతమంది వైసీపీ నేతల నుంచి బెదిరింపులు
ఇదిలావుంటే.. సర్పంచుల సంఘం తరఫున ముగ్గురు సర్పంచులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ వర్గం ఉలిక్కిపడింది. అది కాస్తా.. వైసీపీ అధిష్టానానికి తెలిసిపోవడంతో.. ముగ్గురి చేత నామినేషన్లు విత్ డ్రా చేయించేందుకు.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని రంగంలోకి దింపింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇంట్లో.. పెద్దిరెడ్డి, బుగ్గన ఇతర ముఖ్య నేతలతో సమావేశమై ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవం అయ్యేలా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో.. ఎలాగోలా ముగ్గురిలో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసులుయాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా కొందరు వైసీపీ నేతలు పావులు కదిపారు. అటు.. మిగిలిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులైన గుట్టపాడు మోహన్‌రెడ్డి, భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కొంతమంది వైసీపీ నేతల నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. వైసీపీ అసమ్మతి వర్గం స్వతంత్ర అభ్యర్థులకు తెర వెనుక అండగా ఉండి.. ఫుల్ సపోర్ట్‌గా నిలిచారు. ఆ లోపే నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది.
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు
ఇక.. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అయింది. వైసీపీ తరఫున డాక్టర్ మధుసూదన్, స్వతంత్ర అభ్యర్థులుగా మోహన్‌రెడ్డి, వెంకటవేణుగోపాల్‌రెడ్డి పోటీలో ఉన్నారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దాంతో.. వైసీపీ అభ్యర్థి మధుసూదన్‌తోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న వైసీపీ నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అటు.. స్వతంత్ర అభ్యర్థులకు ఓవైపు టీడీపీ మద్దతు.. సర్పంచుల సంఘం సపోర్టు.. మరోవైపు వైసీపీ అసంతృప్తుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా.. ప్రస్తుత పరిస్థితి.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మధుసూదన్‌తోపాటు పార్టీ పెద్దల్లోనూ అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో.. పోలింగ్ నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.