Minister Karumuri : పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే ఈ బూతులేంటి మంత్రిగారూ..!

ABN , First Publish Date - 2023-05-06T22:22:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతన్నలు రోడ్డున పడ్డారు. ఆదుకోండి మహాప్రభో.. అని ప్రభుత్వం సాయం కోసం వేయికళ్లతో

Minister Karumuri : పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే ఈ బూతులేంటి మంత్రిగారూ..!

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతన్నలు రోడ్డున పడ్డారు. ఆదుకోండి మహాప్రభో.. అని ప్రభుత్వం సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తక్షణ సాయం చేస్తామని చెబుతోందే తప్ప అవన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం రైతులను పరామర్శించడానికి కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కనీసం బయటికి కూడా రాలేదు. అయితే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ‘నేనున్నానంటూ..’ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబుకు ఏ ఒక్క రైతూ గోడు చెప్పుకోవడం కానీ.. పంట నష్టపోయినట్లు చూపించకూడదని వార్నింగ్‌లు ఇవ్వడం గమనార్హం. అయినప్పటికీ అటు రైతులు గానీ.. ఇటు చంద్రబాబు ఏ మాత్రం తగ్గలేదు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాల్సిందేనని శుక్రవారం నాడే మూడ్రోజుల డెడ్‌లైన్ పెట్టారు చంద్రబాబు. ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

ఏంటయ్యా ఇది..!

ఇక అసలు విషయానికొస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు మండలం వేల్పూరులో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ఓవరాక్షన్ చేశారు.!. పంటలు నష్టపోయాయని మంత్రిగారికి చెప్పుకోవడానికి వచ్చిన రైతన్నపై మంత్రి దురుసుగా ప్రవర్తించారు. ‘సార్.. వర్షాలకు పంట నాశనమైంది’ అని మంత్రికి రైతన్న చెప్పగా ఒక్కసారిగా రెచ్చిపోయారాన. ‘పంట నాశనమైతే నేనేం చేస్తాను ఎర్రిపప్ప’ అంటూ మంత్రి దుర్భాషలాడారు. మంత్రి మాటలతో చుట్టుపక్కలున్న జనం అంతా అవాక్కయ్యారు. మంత్రి అయ్యుండి కనీసం వారికి ధైర్యం చెప్పి.. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పాల్సింది పోయి నోరు పారేసుకోవడమేంటని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మంత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి వీడియో చూసిన సామాన్యులు, నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసం బాధ్యత లేకుండా మాట్లాడటమేంటి..? అని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తలంటారా..!

కాగా.. శనివారం నాడు పెండ్యాల ర్యాంపునకు వెళ్తుండగా సీసీ రోడ్డుపై ఉన్న తడిసిన ధాన్యం రాసులను మంత్రి పరిశీలించారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు మిల్లర్లకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా కూడా ఇచ్చారు. అంతేకాదు.. అవసరమైతే నిర్దేశించిన లక్ష్యాలకు మించి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఇక్కడి వరకూ అంతా బాగుంది కానీ.. తణుకు మండలం వేల్పూరుకు వెళ్లిన తర్వాత మంత్రిగారు ఎందుకో రెచ్చిపోయారు.అయితే.. మంత్రి మాటలతో వైసీపీ పెద్దలు కూడా షాకయ్యారట. ఇప్పటికే సీఎంవో నుంచి ఫోన్ కాల్ కూడా వెళ్లడం, తలంటడం అన్నీ జరిగిపోయాయని టాక్ నడుస్తోంది. మరోవైపు.. ప్రతిపక్షాలు మాత్రం మంత్రి కారుమూరిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి కనీస స్పందన అయినా వస్తుందో లేదో వేచి చూడాలి మరి.

Updated Date - 2023-05-06T22:23:02+05:30 IST