Nellore: రూరల్ రాజకీయాలు హాట్‌హాట్.. వైసీపీకి కొరకరాని కొయ్యలా తయారయిన కోటంరెడ్డి ..!
ABN , First Publish Date - 2023-03-02T11:20:58+05:30 IST
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశాల్లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించడమే పాపమైంది. ప్రభుత్వ పెద్దలు
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ప్రభుత్వ పెద్దల వ్యూహాలు పనిచేయడం లేదా?.. ఒకే ఒక్క ఎమ్మెల్యేని హేమాహేమీలు కూడా కట్టడి చేయలేకపోతున్నారా?.. వేధింపులు, కక్ష సాధింపులు తీవ్రం చేసినా ఆయన తగ్గేదేలే అంటున్నారా?.. కోటంరెడ్డి దూకుడుతో సీఎం పరువు పోతుందా?.. ఆయనకు బీజేపీ కూడా మద్దతు ఇస్తుండడంతో నెల్లూరు పాలిటిక్స్ ఇంట్రస్టింగ్‌గా మారుతున్నాయా?.. ఇంతకీ.. కోటంరెడ్డి విషయంలో వైసీపీ వ్యూహాలు ఎందుకు పనిచేయడం లేదు?.. అసలు.. శ్రీధర్‌రెడ్డి ఎపిసోడ్‌లో బీజేపీ మద్దతు కథేంటి?..అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్ సైడ్ లో తెలుసుకుందాం..
20, 30 మంది కోటంరెడ్డిపై ఒకేసారి ఎటాక్
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశాల్లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించడమే పాపమైంది. ప్రభుత్వ పెద్దలు ఆయన్ను టార్గెట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, ట్యాపింగ్ రికార్డులను పోలీసు ఉన్నతాధికారులే పంపించడం, సీఎంతో సర్దుకుపోవాలని బెదిరించడం జరిగింది. పోలీసు ఉన్నాతాధికారులతో బెదిరిస్తే.. భయపడిపోతారని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ.. కోటంరెడ్డి తీవ్ర అవమానంగా ఫీలై తిరుగుబావుటా ఎగురవేశారు. దాంతో.. ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు అయింది. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులురెడ్డి, మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌తోపాటు.. 20, 30 మంది కోటంరెడ్డిపై ఒకేసారి ఎటాక్ చేశారు. అయినా.. ఆయన తొణక్కపోవడంతో మరోసారి పరువు పోయినట్టు అయింది.
ఏ పనీ చేయొద్దంటూ అధికారులకు మౌఖిక ఆదేశాలు
నెల్లూరు రూరల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం జగన్.. ఆ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అప్పగించారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించగా.. అనుకున్నంత స్పందన లేకుండాపోయింది. కోటంరెడ్డికి మద్దతు తెలిపినవారిని వైసీపీ వైపు లాగే ప్రయత్నాలు చేయగా.. సగం మంది కూడా అటు చూడకపోవడంతో వైసీపీ పెద్దలకు మరోసారి చుక్కెదురు అయింది. దాంతో.. కోటంరెడ్డికి.. ఏ పనీ చేయొద్దంటూ ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కోటంరెడ్డి బెదిరించారంటూ కార్పొరేటర్‌తో కేసు పెట్టించారు. 4 నెలల కిందట టీడీపీ నేత కేసు పెడితే దానిని తిరగతోడారు. కోటంరెడ్డితోపాటు 11 మందిని నిందితులుగా చూపారు. జగన్ పాదయాత్ర సమయంలో జిల్లాలో కీలక భూమిక పోషించిన తాటి వెంకటేశ్వరరావు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఇబ్బందులు పెట్టారు. కోటంరెడ్డి వెంట ఉంటే తిప్పలు తప్పవనే హెచ్చరించారు. ఇలా కోటంరెడ్డిపై వేధింపులు, కక్ష్య సాధింపులు తీవ్రమయ్యాయని చెప్పొచ్చు.
కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని సవాల్
వాస్తవానికి... చాలా మంది ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కోటంరెడ్డి చెబుతున్నారు. అయితే.. దానిపై వైసీపీ పెద్దలు ట్యాపింగ్ జరగలేదని ప్రకటనలు చేసి సరిపెట్టుకున్నారు. కోటంరెడ్డి.. కేంద్ర హోం శాఖకి ఫిర్యాదు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని జగన్ ప్రభుత్వానికి సవాలు కూడా విసిరారు. ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఇప్పటికీ కిమ్మనడంలేదు. దాంతో.. ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో రోజురోజుకి అనుమానాలు బలపడుతున్నాయి. అదే సమయంలో.. కోటంరెడ్డి ఫిర్యాదుని కేంద్ర హోంశాఖ పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తుందేమోననే భయాందోళన వైసీపీ పెద్దల్లో కనిపిస్తుందనే చర్చ సాగుతోంది.
సీఎం సంతకం చేసినా నిధులు విడుదల చేయరా?
మరోవైపు.. ఇటీవల నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలపై కోటంరెడ్డి గళమెత్తారు. క్యాంపు కార్యాలయంలోనే నిరసన చేపట్టారు. వేల సంఖ్యలో అభిమానులు, ప్రజలు రావడంతో వైసీపీలో అయోమయం నెలకొంది. సీఎం సంతకం చేసినా.. నిధులు ఎందుకు విడుదల చేయరు?.. ప్రజా సమస్యలు ఎందుకు తీర్చరని ప్రతిరోజూ కోటంరెడ్డి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీఎం సంతకం చేసిన పత్రాలను రేయింబవళ్లు చేతిలో పట్టుకు తిరుగుతున్నారు. ఎవరు కనిపించినా.. అయ్యా.. ఇది న్యాయమా?... అన్నా.. ఇది ధర్మమా?.. సీఎం సంతకానికే విలువ లేదా?.. అని అడుగుతున్నారు. దాంతో.. నెల్లూరు జిల్లాలో ప్రతిరోజూ సీఎం పరువు పోతోందని వైసీపీ నేతలు తెగ వర్రీ అయిపోతున్నారు.
40 ఏళ్ల నుంచి జరగని పరమేశ్వరి అమ్మవారి జాతర
ఇదిలావుంటే.. నెల్లూరు గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి జాతర తిరునాళ్లు 40 ఏళ్ల కిందట నుంచి జరగడం లేదు. ఆ జాతరను స్నేహితులతో కలిసి నిర్వహిస్తామని కోటంరెడ్డి ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. అది కాస్తా ప్రభుత్వ పెద్దలను పద్మవ్యూహంలోకి నెట్టేసింది. ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడంపై నెల్లూరులో పెద్ద చర్చకే దారితీసింది. అమ్మవారిని నెల్లూరీయులు ఆడబిడ్డలా భావిస్తారు. ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా.. ముందుగా గుడికి వెళ్లి అమ్మవారిని ఆహ్వానిస్తారు. దాంతో.. జాతరకు అనుమతి ఇస్తే తప్పేంటి అనే చర్చలు జోరందుకున్నాయి. కోటంరెడ్డి హైలెట్ అవుతారనే ఉద్దేశంతోనే అనుమతి ఇవ్వలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు.. బీజేపీ నేతలు కూడా కోటంరెడ్డికి మద్దతు పలుకుతున్నారు. హిందూ ధార్మిక సంస్థలూ జాతర జరిపించాలని అంటున్నాయి. వేయి దేవుళ్లకి మొక్కి, గ్రామదేవతని పక్కన పెట్టడం మంచిది కాదని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరశింహారావు ప్రకటన చేశారు. ఫలితంగా.. జాతర విషయంలో.. ప్రభుత్వ పెద్దలు, జిల్లా ముఖ్య నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
175 స్థానాల్లో గెలిచేటోళ్లు ఒక్కరిని కట్టడి చేయలేరా?
మొత్తంగా.. వైసీపీకి కోటంరెడ్డి కొరకరాని కొయ్యిలా తయారయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 175 స్థానాల్లో గెలుస్తామంటున్నవారు.. ఒకే ఒక్క ఎమ్మెల్యేని కట్టడి చేయలేకపోతున్నారా..అనే సెటైర్లు పడుతున్నాయి. ఏదేమైనా.. శ్రీధర్‌రెడ్డి ఎపిసోడ్‌తో నెల్లూరు రూరల్ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. అయితే.. ఇప్పటికే.. ఆయన్ను వైసీపీ పెద్దలు టార్గెట్ చేశారని ఆరోపణలు వస్తుండగా.. ఇకపై.. వరుస కేసులతో ఇబ్బందులు పెట్టొచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. కోటంరెడ్డి మాత్రం.. తగ్గేదే లేదంటున్నారు. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో.. ఎవరు తగ్గుతారో.. ఎవరు నెగ్గుతారో.. చూడాలి మరి..