Telangana BJP : ‘బండి’ని తప్పించాక యమా స్పీడ్ మీదున్న ఈటల.. ఈ అస్త్రాలన్నీ ప్రయోగించబోతున్నారా..!?
ABN , First Publish Date - 2023-07-06T20:14:26+05:30 IST
అవును.. ఒకే ఒక్క పదవి.. సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లో (Etela Rajender) ఎనలేని ఉత్సాహాన్ని తెప్పించింది..! ఇన్నిరోజులు పదవి లేదని అసంతృప్తితో నియోజకవర్గానికే పరిమితమైన రాజేందర్ ఇప్పుడు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) ‘ఈట’లను దింపేందుకు రెడీ అయిపోయారు..!
అవును.. ఒకే ఒక్క పదవి.. సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లో (Etela Rajender) ఎనలేని ఉత్సాహాన్ని తెప్పించింది..! ఇన్నిరోజులు పదవి లేదని అసంతృప్తితో నియోజకవర్గానికే పరిమితమైన రాజేందర్ ఇప్పుడు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) ‘ఈట’లను దింపేందుకు రెడీ అయిపోయారు..! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను (Bandi Sanjay) ఏ క్షణాన తొలగించారో నాటి నుంచే ఈయనలో ఏదో తెలియని ఊపొచ్చింది..! ఇందుకు కారణం బండికి ఈటలకు అస్సలు పడకపోవడమే..! కిషన్ రెడ్డిని (Kishan Reddy) అధ్యక్షుడిగా ప్రకటించగానే ఇక ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే రేంజ్‌లో దూసుకుపోతున్నారు..
ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇకపై..!
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో పడక ‘కారు’ దిగి కాషాయ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్ ఉపఎన్నికలకు వెళ్లి మరీ హుజురాబాద్‌లో తన సత్తా ఏంటో సర్కార్‌కు చూపించారు. ఈ ఒక్క గెలుపుతో అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. ఆ తర్వాతే రాజేందర్ రేంజ్ ఏంటో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెలిసొచ్చింది. అయితే మధ్యలో ఇప్పటి వరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌తో కొన్ని కొన్ని విషయాల్లో పొరపచ్చాలు రావడం, ఇంత సీనియార్టీ ఉన్న తనకు గుర్తింపు రాలేదని ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. కేసీఆర్ బలం, బలహీనతలు తెలిసిన నేత, ఉద్యమ నాయకుడు, వీటన్నింటికీ మించి బీసీ నేత కావడం.. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, నేతలందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం, నిబద్ధత కలిగిన నేత కావడంతో ప్రపంచంలో ఎక్కడాలేని ‘చేరికల కమిటీ’ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ దీనికి చైర్మన్‌గా ఈటలను నియమించారు. ఆ తర్వాత చేరికలు ఏ మాత్రం జరిగాయన్నది జగమెరిగిన సత్యమే. అయితే.. అగ్రనాయకత్వం ఈటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందనో లేకుంటే మరేంటో సరైన కారణం తెలియట్లేదు కానీ ఒక్కసారిగా బండి వర్సెస్ రాజేందర్‌కు పరిస్థితులు మారడం.. రెండు వర్గాలు చీలిపోవడంతో రచ్చ రచ్చయ్యింది. అప్పటికే బండిపైనే ఇతర నేతల నుంచి ఫిర్యాదులు ఎక్కువ కావడం, అసంతృప్తులు, వర్గవిబేధాలు ఎక్కువవుతుండటంతో ఎన్నికల ముందు ఎలాంటి విబేధాలకు తావివ్వకూడదని బండిని తప్పించి ఇప్పటికే అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డికి ఆ పదవి బాధత్యలు కట్టబెట్టింది అగ్రనాయకత్వం. ఈటలకు ఇప్పటికే ఉన్న చేరికల కమిటీతో పాటు ఎన్నికల నిర్వహణ కమిటీని కూడా అప్పగించడంతో ఆయనపై బరువు, బాధ్యతలు మరింత పెరిగాయి. బండిని తొలగించడం, కొత్త బాధ్యతలు అప్పగించడం.. మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం ఇవన్నీ ఈటలకు బాగా కలిసొచ్చాయని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈటల వల్లే బండి పదవి ఊడిపోయిందని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఎప్పుడైతే బండిని తప్పించారో అప్పట్నుంచి ఈటల వైఖరి ఒక్కసారిగా మారింది. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇకపైన ఓ లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.
ఈటలను ఆపేదెవరు..!?
సీఎం కేసీఆర్‌పై ఇప్పటి వరకూ తగిలీ తగలక విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన ఈటల.. కీలక బాధ్యతలు కట్టబెట్టిన తర్వాత మునుపెన్నడూలేని విధంగా ‘దూకుడు’ మీదున్నారు. ఏ రేంజ్‌లో కేసీఆర్ బలం, బలహీనతలు, వ్యూహాలు-ప్రతి వ్యూహాలు, బీఆర్ఎస్ ఎత్తులు, పై ఎత్తులు, తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసిన వాడినంటూ ఓ రేంజ్‌లో మీడియా ముందుకొచ్చి ఊగిపోయారు. వీటన్నింటిపై ఎలా ముందుకెళ్లాలనేది సమిష్టిగా సమాలోచనలు చేసి ముందుకెళ్తామన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ కుటుంబానికే లాభం అని.. అదే బీజేపీ గెలిస్తే రాష్ట్రంతో పాటు దేశ ప్రజలకు లాభమని రాజేందర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి అధిష్టానంతో శభాష్ అనిపించుకునేలా పనిచేస్తామన్నారు. ముఖ్యంగా బీజేపీలో ఇప్పుడున్న పరిస్థితులను చక్కదిద్దడానికి అందర్నీ కలుపుకొని వెళ్లడంపైనే దృష్టిసారిస్తున్నట్లు రాజేందర్ మీడియాకు వెల్లడించారు. ఈ కామెంట్స్‌ను చూస్తే మునుపటికి .. ఇప్పటికీ ఈటలలో ఎంత మార్పు వచ్చిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదివరకు బండి అధ్యక్షుడిగా ఉన్నన్నిరోజులు ఈటల ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేసిన దాఖలాల్లేవ్. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యారో లేదో ఒక్కసారిగా ఈటల టోన్ మారింది.. దూకుడు పెరిగిందని చెప్పుకోవచ్చు.
ఈటల చేయబోయేది ఇదేనా..!?
ఈటలను ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్‌లో నంబర్-02 గా, ట్రబుల్ షూటర్‌గా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు పిలుచుకునేవారు. అంటే కేసీఆర్ గురించి.. ఆ పార్టీ గురించి, లోటుపాట్లు, బీఆర్ఎస్ నేతల గురించి అణువణువూ తెలిసని అర్థం. అందుకే.. ఇక తనదగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగించబోతున్నారట. బీఆర్ఎస్ లెక్కలు తీసి.. అవన్నీ నివేదికల రూపంలో అధిష్టానానికి ఈటల ఇవ్వబోతున్నారట. అంతేకాకుండా ఈటలతో మంచి సత్సంబంధాలున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని ముఖ్యులందరితో సంప్రదింపులు జరిపి త్వరలోనే భారీగా చేరికలకు ప్లాన్ చేయబోతున్నారట. వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్‌ల టికెట్ల లొల్లి జరుగుతోంది.. ఇప్పుడిప్పుడే కొందరు ముఖ్యనేతలు, సిట్టింగ్‌లు, సీనియర్లు, మాజీలంతా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమైపోతున్నారు. అందుకే ఇదే సరైన సమయంగా భావించి వారితో తన టీమ్‌తో కలిసి మంతనాలు జరపడానికి ఈటల రంగం సిద్ధం చేసుకున్నారట.
మొత్తానికి చూస్తే.. ఈటలను ఇకపై ఈటల 2.0గా చూడబోతున్నాం అన్న మాట. ఈటల త్వరలో ప్రయోగించబోయే అస్త్రాలు ఎంతమేరకు వర్కవుట్ అవుతాయో..? కిషన్ రెడ్డి-ఈటల నాయకత్వంలో మునుపటితో పోలిస్తే ఎంతవరకు దూసుకెళ్తుందో..? తెలియాలంటే అసలు సిసలైన ఎన్నికల సీజన్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే మరి.