TS BJP : తెలంగాణ బీజేపీలో ఎగసిపడుతోన్న అసంతృప్తి జ్వాలలు.. ఈటల ఢిల్లీ వెళ్లడంతో..!
ABN , First Publish Date - 2023-03-15T20:25:50+05:30 IST
తెలంగాణ బీజేపీలో (TS BJP) అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అసలు రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోందో ముఖ్య నేతలు మొదలుకుని..
తెలంగాణ బీజేపీలో (TS BJP) అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అసలు రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోందో ముఖ్య నేతలు మొదలుకుని, ద్వితియ శ్రేణి నాయకుల వరకూ ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) ఈడీ నోటీసులివ్వడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (TS BJP Chief Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ లోలోపల ఎన్ని ఉన్నా ఎంతో ప్రశాంతంగా ఉన్న కమలనాథుల్లో ఒక్కసారిగా.. బండిపై కొందరు ఒంటికాలిపై లేచి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బండి కామెంట్స్‌ను ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా తప్పుబట్టడం.. ఆ తర్వాత మరికొందరు నేతలు ఏకంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా బండిని తిట్టిపోస్తూ పోస్టులు చేసేశారు. ఉన్న అతి తక్కువ మంది నాయకుల్లోనే గ్రూపులు కట్టడంతో పరిస్థితులు మారిపోయాయ్. తెలంగాణలో ఇంత రాద్ధాంతం జరుగుతుండగా.. సడన్‌గా సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) చేరికల కమిటీకి రాజీనామా చేయబోతున్నారనే వార్త క్యేడర్‌ను ఉలిక్కిపడేలా చేసింది. తాను రాజీనామా చేయట్లేదని ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.
హస్తిన టూర్‌తో..!
ఇంత క్లియర్‌కట్‌గా ఈటల చెప్పినప్పటికీ ఇప్పటికీ రూమర్స్, వార్తలు మాత్రం ఆగట్లేదు. తాజాగా ఆయన ఢిల్లీకెళ్లడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. మొన్న రాజీనామా అంటూ వార్తలు రావడం.. నిన్నేమో ఈటల క్లారిటీ ఇవ్వడం.. ఇవాళ ఇలా ఢిల్లీకెళ్లడంతో ఏదో జరుగుతోందని ఆయన అభిమానులు, అనుచరులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. హస్తిన టూర్‌లో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Union Minister Kishan Reddy) కలిశారు. ఆ తర్వాత ఒకరిద్దరు ఢిల్లీ పెద్దలతో ఈటల భేటీ అయ్యారు. అయితే.. పార్టీలో చేరికలు సంగతేంటి..? అప్పట్లో భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు కదా..? ఇలా ఈటలపై ఢిల్లీ పెద్దలు ప్రశ్నల వర్షం కురిపించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈయన ఒక్కరే కాదు.. తెలంగాణ బీజేపీ నేతలపై జాతీయ నాయకత్వం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని.. వెంటనే చేరికలు ముమ్మరం చేయాలని ఈటలను పెద్దలు ఆదేశించినట్లు సమాచారం.
ఈటల అసంతృప్తిగా ఉన్నారా..!?
పార్టీలో చేరిన నేతలకు కచ్చితంగా టిక్కెట్ హామీ ఇవ్వాలన్నది ఈటల ప్రధాన డిమాండ్ అని తెలుస్తోంది. అయితే బీజేపీలో మాత్రం ఆ పరిస్థితులు ఎప్పుడూ ఉండవట. దీంతో చేరికలు ఆలస్యవుతున్నాయ్ అని బయట టాక్ నడుస్తోంది. అసలు చేరికలకు ఒక కమిటీ ఉండటం, దానికి మళ్లీ చైర్మన్ ఉండటం అనేది ఇప్పటి వరకూ ఏ పార్టీల్లో లేదట. అలాంటిది చేరికల కోసం కమిటీ వేయడం ఏంటి..? పోనీ బీజేపీలో చేరే వాళ్లకు ఎలాంటి పదవులు, టిక్కెట్ హామీలు ఇవ్వకపోవడం ఏంటని ఈటల చాలా అసంతృప్తిగానే ఉన్నారట. అసలు కమిటీ వ్యవహారాలే తనకొద్దని చెప్పడానికే ఈ ఢిల్లీ టూర్ (Etela Delhi Tour) అని తెలంగాణ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఈటల ఎలా ఉన్నారు.. ఇప్పుడు చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో..? అని బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక.. అక్కడేం జరిగింది..? ఈటల ఏం చేయబోతున్నారనేదానిపై ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
పార్టీలో ఏం జరుగుతోంది..!?
ఈ మధ్య బండి సంజయ్‌పై డైరెక్టుగా మీడియా మీట్‌లు పెట్టి సొంత పార్టీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయనపై లేనిపోని ఆరోపణలు సీనియర్ నేతలే చేస్తున్నారు. దీంతో అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది..? పార్టీలో ఏం జరుగుతోందని ఈటలను అడిగి జాతీయ నేతలు ఆరాతీసినట్లుగా సమాచారం. మరోవైపు.. పార్టీలో ఏం జరుగుతోందో తెలియక కమలం పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయింది. దీంతో తెలంగాణలో పరిస్థితులను చక్కబెట్టడానికి త్వరలోనే జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), సునీల్ బన్సల్ (Sunil Bansal) ఇద్దరూ పర్యటిస్తారని తెలియవచ్చింది.
మొత్తానికి చూస్తే.. తెలంగాణ బీజేపీపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెడితే తప్ప పరిస్థితులు దారికొచ్చేలా లేవని స్పష్టంగా అర్థమవుతోంది. ఢిల్లీ నుంచి ఈటల మీడియా మీట్ పెట్టి ఏం చెబుతారు..? రాష్ట్ర కమలనాథులపై బీజేపీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.