Luthra On CBN Case : రంగంలోకి దిగిన సిద్ధార్థ లూథ్రా.. లాజిక్ ప్రశ్నలు, సెక్షన్లతో కొట్టిన లాయర్.. అంతా సైలెంట్!
ABN , First Publish Date - 2023-09-10T13:22:15+05:30 IST
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) విజయవాడ ఏసీబీ కోర్టులో (ACB Court) హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇప్పటికే సీఐడీ తరఫు వాదనలు పూర్తి కాగా.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) విజయవాడ ఏసీబీ కోర్టులో (ACB Court) హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇప్పటికే సీఐడీ తరఫు వాదనలు పూర్తి కాగా.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుమారు గంటకుపైగా లూథ్రా వాదించారు. సిద్ధార్థ రంగంలోకి దిగగానే కోర్టు లోపల వాతావరణం మొత్తం మారిపోయింది. ప్రభుత్వం, సీఐడీ అధికారులపై ఆయన సంధించిన ప్రశ్నలకు కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సీఐడీ లాయర్లు కొందరు ముక్కున వేలేసుకున్న పరిస్థితట. ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసేంటి..? ఎప్పుడు ఇది జరిగింది..? అసలు చంద్రబాబుకు సంబంధం లేదా..? బాబును అరెస్ట్ చేసిన తీరు..? ఇలా ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో సాంకేతిక అంశాలతో కూడిన ప్రశ్నలను లూథ్రా లేవనెత్తారు. అంతేకాదు.. గతంలో జరిగిన కొన్ని కేసులను సైతం ఉదహరించి మరీ కోర్టులో వివరించారు.
లూథ్రా లేవనెత్తిన కీలక విషయాలు ఇవే..?
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం
2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి
తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది.. ఈకేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్ వచ్చింది
ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారు
చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలు
ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది
సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదు
ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్న సమయంలో సెక్షన్-409 వర్తించదు
ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది..?
రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించండి.
చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది..
అయినా కూడా ప్రభుత్వం వాళ్లనుకున్న చోటే ప్రవేశపెట్టింది.
కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు చంద్రబాబును ఎందుకు నిర్భందించారో అర్థం కావట్లేదు..?
సీఐడీ ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు.
చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీఐడీ చెబుతోంది..కానీ బాబును ముందురోజు రాత్రి 11 గంటలకే సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు.
ఆ సమయం నుంచే అరెస్ట్ చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలి.
రాత్రి 11 గంటలకు చుట్టుముట్టి కదలకుండా చేయడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే.
సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి
అరెస్టు చేసిన పోలీసుల 48గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించాలి
అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదు.
చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరం.. ఇది అనుబంధ పిటిషన్ మాత్రమే.
రిమాండ్ రిపోర్టు వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలి
అరెస్టు అంటే అర్థం ఏమిటో సీఐడీ లాయర్లకు వివరించిన సిద్దార్థ్ లూథ్రా
రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ప్రస్తావించిన లూథ్రా
ఎవరేం మాట్లాడారు..?
సీఐడీ న్యాయవాది : ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర కీలకమం. చంద్రబాబు బలవంతం మీదే నిధులు విడుదల జరిగింది. మధ్యవర్తిగా కిలారు రాజేష్ వ్యవహరించారని.. ఆయన ద్వారానే ఇదంతా జరిగింది.
ఏసీబీ కోర్టు జడ్జి : 2021లో కేసు నమోదు అయితే ఇంతవరకూ చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు..?. గతంలో FIRలో చంద్రబాబు పేరు ఎందుకు లేదు..? బాబు పేరును ఇప్పుడెలా చేర్చారు.? FIR నమోదులో ఆలస్యంపై కారణాలేంటి. చంద్రబాబు పాత్ర ఉందని నిరూపించే ఆధారాలు ఉన్నాయా..?
సీఐడీ న్యాయవాది : రిమాండ్ రిపోర్టులో 19వ పేజీల, పేరా-08లో అన్ని అంశాలు పొందుపరిచాం. కేసులో ఏ-37, ఏ-38 పాత్రపై వివరంగా చెప్పాం.
కాసేపు విరామం.. టెన్షన్.. టెన్షన్
చంద్రబాబుపై సెక్షన్-409 పెట్టడంపైనే వాడివేడిగా ఉందయం నుంచి వాదనలు జరిగాయి. ఇలా వాదనలు సాగుతుండగానే చంద్రబాబు రిమాండ్ కేసు విచారణకు జడ్జి విరామం ఇచ్చారు. భోజనం విరామం తర్వాత మధ్యాహ్నం 01:30 గంటలకు వాదనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వాదనలు పూర్తికాగానే మధ్యాహ్నం 3 గంటలకు తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోర్టులో వాదనలు జరుగుతుండగానే ఏసీబీ కోర్టు ప్రాంతంలో వాతావరణం మాత్రం ఉత్కంఠ సాగుతోంది. టీడీపీ కార్యకర్తలు, నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బెయిల్ రావాలంటూ టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకోవైపు కోర్టు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ పరిణామాలతో అసలేం జరుగుతోందో తెలియని గందరగోళం నెలకొంది.