TS BJP : కేంద్రమంత్రి సమక్షంలోనే తెలంగాణ బీజేపీ నేతల కొట్లాట.. ఈటల.. ఎందుకిలా..!?
ABN , First Publish Date - 2023-02-04T22:39:17+05:30 IST
అవును.. తెలంగాణ బీజేపీ నేతలు (TS BJP Leaders) కేంద్ర మంత్రి సమక్షంలోనే కొట్లాడుకున్నారు. బాబోయ్.. అటు ఇటు సర్దిచెప్పేవాళ్లు లేకుంటే కొట్టుకునేవాళ్లేమో అన్నంతగా పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ : అవును.. తెలంగాణ బీజేపీ నేతలు (TS BJP Leaders) కేంద్ర మంత్రి సమక్షంలోనే కొట్లాడుకున్నారు. బాబోయ్.. అటు ఇటు సర్దిచెప్పేవాళ్లు లేకుంటే కొట్టుకునేవాళ్లేమో అన్నంతగా పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) అయితే ఏకంగా ఏమిటీ అడ్డగోలు మాటలు అంటూ కన్నెర్రజేశారు. ఇలా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చున్నారు. ఇంతకీ తెలంగాణ (Telangana) బీజేపీ నేతల మధ్య ఏం జరిగింది..? ఇంత రచ్చ జరగడానికి కారణాలేంటి..? అసలు ఆ కేంద్ర మంత్రి ఎవరనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..
కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలంగాణలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో అసలేం జరుగుతోంది..? మునుపటికి ఇప్పటికీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది..? అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. బీఆర్ఎస్‌పై విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. రైల్వే ప్రవైటీకరణపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు కౌంటర్ కూడా ఇచ్చారు. అలా కేంద్ర మంత్రి ప్రెస్‌మీట్ ముగియగానే పార్టీ ఆఫీసులో రాష్ట్ర నేతలతో సమావేశం అయ్యారు కేంద్రమంత్రి. తెలంగాణలో పార్టీ బలోపేతం, కేంద్ర సాయంపై నాయకులకు అశ్వనీ వైష్ణవ్ దిశానిర్దేశం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంత సీరియస్‌గా డిస్కషన్ జరుగుతుండగా.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి (Ponguleti Sudhakar reddy) మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan rao) సీన్‌లోకి ఎంటరయ్యారు.
ఒకరిపై ఒకరు కోపతాపాలు..!
సీన్ కట్ చేస్తే.. ఇదంతా ఈటల వర్సెస్ పొంగులేటిగా పరిస్థితులు మారిపోయాయ్. స్థానిక పరిస్థితులను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఈటల. కేంద్రంపై BRS నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఈటల ఫైర్ అయ్యారు. BRSకు కౌంటర్ ఇచ్చే విషయంలో సమాచారం రావటంలేదని కాసింత అసంతృప్తిని కూడా వెల్లగక్కారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటే సరిపోదని.. ఏం చేయాలో.. ఎలా చేయాలో చెప్పేవారు రాష్ట్ర పార్టీలో లేరని తన మనసులోని మాటలు, అసంతృప్తిని ఈటల బయటపెట్టేశారు. బాబోయ్.. ఈయన్ను ఇలాగే వదిలేస్తే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సీన్‌లోకి ఎంటరయ్యారు. ఈటలను మాట్లాడుతుండగా అడ్డుకున్నారు. BRS ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ పోరాటం చేస్తోందని కేంద్రమంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పొంగులేటి తీరు ఎమ్మెల్యే రఘునందర్ రావుకు ఆగ్రహం తెప్పించింది. ఈటలను ఎందుకు మాట్లాడినివ్వడం లేదు..? ఆయన చెప్పేది చెప్పనివ్వండి అంటూ పొంగులేటిని వారించారు. కేంద్రమంత్రి సమక్షంలో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ అవుతోంది.
వాట్ నెక్స్ట్..!
ఈ మధ్య ప్రతి విషయంలోనూ ఈటల వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చర్చనీయాంశమే అవుతోంది. ఇటీవలే తెలంగాణలోని అన్ని పార్టీల్లో కేసీఆర్ (KCR) కోవర్టులు ఉన్నారని ఉన్నట్టుండి బాంబ్ పేల్చగా అది పెద్ద రచ్చే అయ్యింది. ఈయన మాటలతో ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి సమక్షంలోనూ కమలనాథులు నానా రచ్చ చేసి వార్తల్లో నిలిచారు. ఈ మొత్తం వ్యవహారంపై అటు కేంద్రంలోని.. ఇటు రాష్ట్రంలోని బీజేపీ పెద్దలు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.