MLC Elections: రాజకీయంగా వేడి పుట్టిస్తున్న..ఉపాధ్యాయ, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు..
ABN , First Publish Date - 2023-03-04T10:54:28+05:30 IST
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలు రసకందాయంలో..
తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉద్యమ సంఘాలకు పరిమితమైన ఎమ్మెల్సీ ఎన్నికలు.. పార్టీల ఎంట్రీతో హీటెక్కుతున్నాయి. బలమైన అభ్యర్థులు బరిలో దిగినా.. రెబల్స్ బెడద, అసంతృప్తి ఇబ్బందిగా తయారయ్యాయి. కొందరు అభ్యర్థులు.. ప్రలోభాల బాటలో పయనిస్తుంటే.. మరికొందరు మాత్రం.. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకు నమ్ముకున్నారు. ఇంతకీ.. ఉద్యమ సంఘాల ఎన్నికల్లో పార్టీల ఎంట్రీ దేనికి సంకేతం?.. అసలు.. బరిలో దిగిన.. ఆ బలమైన అభ్యర్థులెవరు?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఉపాధ్యాయ, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. 13న జరిగే పోలింగ్‌తో గెలిచేదెవరో తెలుస్తుంది. దాంతో.. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఆయా పార్టీలు, పోటీలోనున్న అభ్యర్థులు.. గెలుపే లక్ష్యంగా ఎవరికివారు ఎత్తులు పైఎత్తులతో ముందుకు సాగుతున్నారు. ఇంతకుముందు.. ఉద్యమ సంఘాలకు పరిమితమైన ఎన్నికల్లో.. ఇప్పుడు పార్టీలు కూడా అడుగుపెట్టడంతో ఓటర్లపై ఒత్తిళ్ళు, రకరకాల ప్రలోభాలకు తెరలేచింది. అందుకే.. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీ
ఇక.. ఉద్యమ సంఘాలైన పీడీఎఫ్ అభ్యర్థులకు రెబల్స్ బెడదతోపాటు అసంతృప్తుల భయం వెంటాడుతోంది. వైసీపీ అభ్యర్థులు మాత్రం అధికార అండతో ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నారు. టీడీపీ మద్దతుదారులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత.. ప్లస్ అవుతుందని నమ్ముతున్నారు. పట్టభద్రుల స్థానానికి 22 మంది, ఉపాధ్యాయ స్థానానికి 8 మంది బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం స్థానంలో నెల్లూరు జిల్లాకు చెందిన బాబురెడ్డిని, పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరెడ్డిని యూటీఎఫ్, ఎస్టీయూ సంఘాలు బలపరుస్తున్నాయి.
గత ఎన్నికల్లో వారికి సహకరించిన వైసీపీ.. ఇప్పుడు స్వయంగా అభ్యర్థులను నిలబెట్టింది. అయితే.. సిట్టింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి ప్రచారంలో అభ్యర్థుల వెంట ఎక్కడా కనిపించకపోవడం, సీనియర్ యూటీఎఫ్ నేత సోమచంద్రారెడ్డి వైసీపీకి పనిచేయడం చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు.. యూటీఎఫ్ అసంతృప్త నేత చిత్తూరుకు చెందిన శ్రీరామ్మూర్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయన.. పోటీలో ఉన్న మిగతావారంతా.. ఒకే సామాజికవర్గానికి చెందిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సామాజిక న్యాయం, మార్పు కోసం గెలిపించాలని శ్రీరామ్మూర్తి కోరుతున్నారు. ఆయా పరిణామాలు యూటీఎఫ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఏం చేస్తే బాగుంటుందనేదానిపై వైసీపీ మల్లగుల్లాలు
ఇదిలావుంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అధికార, ఆర్థిక బలం తోడు కావడం ప్రలోభాల పర్వానికి తెరలేపుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నెల్లూరుకు చెందిన శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిని వైసీపీ బరిలోకి దించింది. ఆర్థికంగా బలవంతులైన ఆ ఇద్దరిని గెలిపించుకోవాలని అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలను కూడా రంగంలోకి దింపింది. సన్నాహక సమావేశాలతోపాటు నామినేషన్ కార్యక్రమానికి బడా నేతలందరూ తరలివచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రైవేటు విద్యాసంస్థల సంఘం రాష్ట్ర నేత కావడంతో ప్రైవేట్ టీచర్ల ఓట్లపై దృష్టి పెట్టారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రభావం ఎన్నికలపై పడకుండా ఏం చేస్తే బాగుంటుందనేదానిపై వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు.. రహస్య ప్రాంతాల్లో.. అధికార సమీక్షల పేరుతో ఓట్ల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. ఏపీ ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులూ లేకపోలేదు. టీడీపీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒంగోలుకు చెందిన కంచెర్ల శ్రీకాంత్ పోటీలో ఉన్నారు. అతని గెలుపు కోసం టీడీపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు జరిగిన లోకేశ్ యువగళం పాదయాత్ర కార్యక్రమాల్లోనూ శ్రీకాంత్‌ను గెలిపించాలంటూ ఎక్కడిక్కడ పరిచయం చేస్తూ వచ్చారు. అలాగే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పలు సంఘాల మద్దతుతో బరిలో ఉన్న నెల్లూరుకు చెందిన ఎల్‌సీ రమణారెడ్డికి టీడీపీ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. గత పరిస్థితి నుంచి ఉపాధ్యాయులు మార్పు కోరుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా.. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఏదేమైనా.. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని దీవిస్తారో చూడాలి మరి.