YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో అటు సీబీఐ దూకుడు.. ఇటు కీలక పరిణామం..
ABN , First Publish Date - 2023-05-12T19:32:17+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లెక్కలేనన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఎంతమందిని సీబీఐ (CBI) విచారించానా..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లెక్కలేనన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఎంతమందిని సీబీఐ (CBI) విచారించానా.. ఎన్ని కోణాల్లో ప్రశ్నించినా ఈ మొత్తం వ్యవహారం అటు ఇటు తిరిగి ఆఖరికి రక్త సంబంధీకుల వద్దకే చేరుతుండటం గమనార్హం. అయితే.. కుటుంబ సభ్యులు కూడా హత్యకు కారణం బయటి వ్యక్తులే అని చెప్పలేకపోతున్న పరిస్థితి. అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇటు వివేకానందరెడ్డి కుటుంబాలు.. ఒకరిపై ఒకరు అనుమానాలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సీబీఐ దూకుడు మీద ఉండగా.. ఇటు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వివేకా రాసిన లేఖపై (Viveka Letter) వేలి ముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు ప్రారంభించింది. అయితే.. ఈ కేసులో ఇవాళ ఒక్కరోజే రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ట్రయల్ కోర్టుపై సుప్రీంకు సునీత..!
వివేకా కుమార్తె సునీతారెడ్డి దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) మరో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తును పర్యవేక్షించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని కోర్టును సునీతా కోరారు. కాగా అంతకుముందు.. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని ట్రయల్ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. జూన్- 30 నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున తాము పర్యవేక్షించలేమని సునీత పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టును సునీత కోరారు. ఈనెల 20 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు కారణంగా ట్రయల్ కోర్టు పర్యవేక్షణకు మార్గం సుగమం చేయాలని సునీత విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లెటర్ లెక్క తేల్చేందుకు..!
కాగా.. శుక్రవారం రోజే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా రాసిన లేఖపై (Viveka Letter) వేలి ముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు ప్రారంభించింది. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ (CFSNL) తేల్చిన విషయం తెలిసిందే. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను (కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్) సీబీఐ కోరింది. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకూ ఈ లేఖ వ్యవహారం పెను సంచలనంగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఈ లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు (Ninhydrin Test) అనుమతించాలని సీబీఐ కోర్టులో దర్యాప్తు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ గడువు జూన్-20వరకు మాత్రమే ఉండటంతో దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ పిటిషన్‌పై జూన్-2న విచారణ న్యాయస్థానం జరపనున్నది. అయితే విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఏం తేలుస్తుందో మరి.