prakasam district: కొండపి నియోజకవర్గంలో రెండుగా చీలిన వైసీపీ..వర్గపోరుకు కారణమేంటి?

ABN , First Publish Date - 2023-02-28T11:46:56+05:30 IST

ప్రకాశం జిల్లా కొండపిలో వైసీపీ లీడర్ల పాలిటిక్స్ రచ్చరచ్చగా మారాయి. నిన్నమొన్నటివరకు ఒకరిపై

prakasam district: కొండపి నియోజకవర్గంలో రెండుగా చీలిన వైసీపీ..వర్గపోరుకు కారణమేంటి?

ప్రకాశం జిల్లా కొండపి వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. వైసీపీ నేతల ఆధిపత్య పోరు పార్టీని బజారున పడేస్తోంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌, మాజీ ఇన్‌చార్జ్‌ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమారం రేపుతోంది. ప్రత్యర్థుల ఇళ్లపై ఓ వర్గం నేతలు దాడులకు పాల్పడడంతో కొండపి వైసీపీలో కాకరేపింది. ఇంతకీ.. ఎవరా ఇన్‌చార్జ్‌, మాజీ ఇన్‌చార్జ్‌లు?.. కొండపి వైసీపీలో వర్గపోరుకు కారణమేంటి?..అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1654.jpg

కొండపి నియోజకవర్గంలో రెండుగా చీలిన వైసీపీ

ప్రకాశం జిల్లా కొండపిలో వైసీపీ లీడర్ల పాలిటిక్స్ రచ్చరచ్చగా మారాయి. నిన్నమొన్నటివరకు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్న నాయకులు.. తాజాగా.. సొంత పార్టీలోని ప్రత్యర్థుల ఇళ్ళపై దాడులకు పాల్పడుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన కొండపి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రస్తుతం వరికూటి అశోక్‌బాబు పని చేస్తున్నారు. అయితే.. కొండపిలో అశోక్‌బాబు పెత్తనాన్ని మాజీ ఇన్‌ఛార్జ్ వెంకయ్య, అతని వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా.. కొండపి నియోజకవర్గంలో వైసీపీ రెండుగా చీలిపోయింది. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఇది కూడా చదవండి: బ్యాంక్ లాకర్ వినియోగించేవారికి తలనొప్పిగా మారిన ఆర్బీఐ కండీషన్స్

అధికారంలోకి రావడంతో పెత్తనం కోసం పావులు

వాస్తవానికి.. గతంలో అశోక్‌బాబు ఓ సారి వైసీపీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. గత ఎన్నికల ముందు వరకూ ఆయన కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉండగా.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకున్న డాక్టర్ వెంకయ్యకి వైసీపీ టిక్కెట్ దక్కింది. అయితే.. వెంకయ్యకు టిక్కెట్ ఇవ్వడాన్ని అశోక్‌బాబు వర్గం వ్యతిరేకించింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసి వెంకయ్య ఓటమి పాలైనా.. వైసీపీ అధికారంలోకి రావడంతో పెత్తనం కోసం పావులు కదిపారు. అదేసమయంలో.. వైసీపీకి రెబల్ నాయకుడిగా మారి పార్టీకి నష్టం చేకూరుస్తున్నారంటూ అశోక్‌బాబుని వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత.. ప్రకాశం జిల్లాలో పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో అశోక్‌బాబు మళ్లీ ఎంటర్‌ అయ్యారు. అంతేకాదు.. ఏడాది క్రితం అశోక్‌బాబుకి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి కూడా అప్పగించారు. దాంతో.. వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.

Untitled-1344.jpg

ఇన్‌చార్జ్ పదవి నుండి తొలగించాలని డిమాండ్

అశోక్‌బాబుకి ఇన్‌ఛార్జ్ పదవి ఇవ్వడాన్ని వెంకయ్య వర్గం జీర్ణించుకోలేకపోతోంది. వెంకయ్య వర్గానికి చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, నామినేటెడ్ పదవులు పొందిన నేతలు అశోక్‌బాబుకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేసిన అశోక్‌బాబును ఇన్‌ఛార్జ్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో.. ఇటీవల వెంకయ్య వర్గీయులు అశోక్‌బాబుకి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు ఆరోపణలు చేశారు. దాంతోపాటు.. కొందరు.. అశోక్‌బాబు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసం చేశారంటూ కరపత్రాలు పంచడంతో కలకలం రేపింది.

Untitled-1474.jpg

ఎవరికివారు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహారం

ఇక.. సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గం నుండి వ్యతిరేకత ఎక్కువ కావడంతో అశోక్‌బాబుతోపాటూ ఆయన వర్గీయులు బరితెగించారు. పార్టీలో వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరుణ, వైసీపీ నేత డేవిడ్ ఇళ్లపై దాడి చేశారు. అనుచరులతోపాటూ ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లిన అశోక్‌బాబు.. వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దాంతో.. కొండపి వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయి చేరినట్లు అయింది. పనిలో పనిగా.. దాడులు చేయడాన్ని నిరసిస్తూ.. అశోక్‌బాబును ఇన్‌ఛార్జ్ పదవి నుండి తొలగించాలని వెంకయ్య వర్గం డిమాండ్ చేస్తోంది. రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు ఎవరికివారు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో కొండపి వైసీపీ పాలిటిక్స్‌ చర్చనీయాంశం అవుతున్నాయి.

Untitled-1554.jpg

మొత్తంగా.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. వైసీపీకి వర్గపోరు తలనొప్పిగా మారుతోంది. ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పుడు.. అదే సీన్‌.. ప్రకాశం జిల్లా కొండపిలోనూ దర్శనమిస్తోంది. తాజా, మాజీ ఇన్‌చార్జ్‌ల మధ్య పోరు.. పార్టీ పరువు బజారున పడేలా చేస్తోంది. అయితే.. కొండపి వైసీపీ నేతలు.. దాడుల చేసుకునే వరకూ వెళ్లడంతో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.

Updated Date - 2023-02-28T12:09:33+05:30 IST