Viral: బైక్‌లో లక్ష రూపాయల బ్యాగ్‌.. దొంగిలించి చెట్టెక్కిన కోతి.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2023-07-06T17:39:39+05:30 IST

ఒక కోతి చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే లక్ష రూపాయలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన కోతి చెట్టుపై కూర్చుంది. దిగిరమ్మంటే ఎంతకీ రాలేదు. చివరకు చేసేదేం ఏం లేక.. పాపం ఆ బ్యాగ్ యజమాని.. ‘‘నా బ్యాగ్ నాకు ఇవ్వవే.. అందులో లక్ష రూపాయలున్నాయే.. కావాలంటే అందులో నుంచి కొంత డబ్బుతో నీకు తినడానికి ఏమైనా ఇప్పిస్తాను’’ అన్నట్లుగా వేడుకున్నాడు.

Viral: బైక్‌లో లక్ష రూపాయల బ్యాగ్‌.. దొంగిలించి చెట్టెక్కిన కోతి.. చివరకు ఏమైందంటే..

కోతులు సాధారణంగా చాలా చిలిపి పనులు చేస్తుంటాయి. చేతిలో ఉండే ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, వస్తువులను చిందర వందరగా పడేయడం, అటుగా వెళ్తున్న వ్యక్తులను రాయి తీసుకుని కొట్టడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అందుకే.. ఇంట్లో పిల్లలు అల్లరి పనులు చేస్తే కోతి చేష్టలని పెద్దలు తిడుతుంటారు. అయితే తాజాగా ఒక కోతి చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే లక్ష రూపాయలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన కోతి చెట్టుపై కూర్చుంది. దిగిరమ్మంటే ఎంతకీ రాలేదు. చివరకు చేసేదేం ఏం లేక.. పాపం ఆ బ్యాగ్ యజమాని.. ‘‘నా బ్యాగ్ నాకు ఇవ్వవే.. అందులో లక్ష రూపాయలున్నాయే.. కావాలంటే అందులో నుంచి కొంత డబ్బుతో నీకు తినడానికి ఏమైనా ఇప్పిస్తాను’’ అన్నట్లుగా వేడుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో నివసించే షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో ఉన్న షహాబాద్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. సేల్ డీడ్ కోసం ద్విచక్రవాహనంపై షరాఫత్ హుస్సేన్ అక్కడికి వెళ్లాడు. అధికారులు రావడానికి ఇంకా సమయం ఉండడంతో తన దగ్గర లక్ష రూపాయల నగదున్న బ్యాగును ద్విచక్రవాహనంపై ఉంచి అక్కడికి దగ్గరలో ఉన్న బల్లపై కూర్చున్నాడు. బల్లపై కూర్చొని ఏవో కాగితాలు చూసుకుంటూ తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇంతలో ఓ కోతి అక్కడికి వచ్చింది. తనకు తినడానికి ఏమైనా దొరుకుతాయమో అని ద్విచక్రవాహనంపై మొత్తం వెతికింది. మరి తనకు తినడానికి ఏం దొరకలేదని నొచ్చుకుందో ఏమో తెలియదు కానీ, ద్విచక్రవాహనంపై ఉన్న లక్ష రూపాయల డబ్బుతో కూడిన బ్యాగును ఎత్తుకెళ్లింది. హుస్సేన్ ఇది గమనించి అక్కడికి చేరుకునే లోపే కోతి బ్యాగును తీసుకుని వెళ్లి చెట్టు పైన కూర్చుంది.

దీంతో అక్కడే ఉన్న స్థానికులు, హుస్సేన్.. కోతి నుంచి బ్యాగ్‌ను తిరిగి తీసుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. ఎంత ప్రయత్నించినా కోతి బ్యాగ్ ఇవ్వలేదు. దీంతో స్థానికులు కోతిని వెంబడించారు. ఎట్టకేలకు బ్యాగును అక్కడే వదిలేసి కోతి వెళ్లిపోయింది. దీంతో తన లక్ష రూపాయలు తనకు దక్కడంతో షరాఫత్ హుస్సేన్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కాగా నిజానికి రాంపూర్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. నిత్యం ఏదో ఒక రూపంలో స్థానికులను కోతులు ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో షహాబాద్‌లో కోతుల బెడద పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-07-06T17:51:57+05:30 IST