Chit chat: బార్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటలతోనే వీడిన మర్డర్ మిస్టరీ.. అచ్చం అతడు సినిమాలో జరిగినట్టుగానే..!
ABN , First Publish Date - 2023-03-10T15:26:54+05:30 IST
రహస్యం అనేది ఏదో ఒకరోజు బయటపడక తప్పందంటారు. చాలా మంది నేరం చేసి తెలివిగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎక్కడో...
రహస్యం అనేది ఏదో ఒకరోజు బయటపడక తప్పందంటారు. చాలా మంది నేరం చేసి తెలివిగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎక్కడో... ఏదొకటి క్లూ అనేది మాత్రం దొరక్కుండా పోదు. సీబీఐ గానీ... సీఐడీ గానీ.. లేకుంటే ఇంటెలిజెన్స్‌గానీ.. ఏదో ఒక చిన్న క్లూతో నేరాన్ని పసిగట్టేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఓ మర్డర్ మిస్టరీని ఆ కబుర్లే పట్టించాయి. అదెలాగో ఒకసారి మహేశ్‌బాబు (Mahesh Babu) అతడు సినిమా (Athadu) గుర్తు చేసుకోండి. గుర్తొచ్చిందా? అయితే ఈ వార్త చదివితే మీకే అర్థమైపోతుంది.
కోపం.. మత్తు.. ఈ రెండూ నిజాలు బయట పెడుతుంటాయంటారు. మత్తులో నిజాలు కక్కేస్తారు అనడానికి ఇదొక చక్కటి ఊదాహరణ. అదొక బార్ అండ్ రెస్టారెంట్. బార్‌లోకి తాగేందుకు వచ్చినవాళ్లు మద్యం తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. అక్కడే హాట్ హాట్‌గా ఏదో తింటూ ఉన్న ఓ వ్యక్తికి వినిపించకూడని మాటలేవో చెవిని పడ్డాయి. అంతే తినివాడు కాస్తా ఆగిపోయి ఆ సంభాషణపై దృష్టి పెట్టాడు. అతను పోలీస్ ఇన్ఫార్మర్ (Police informer). అంతే వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాడు. సీన్ కట్ చేస్తే పోలీసులు.. ఓ హత్య కేసును ఈజీగా ఛేదించేశారు. ఇలా ఇద్దరు వ్యక్తుల చిట్‌చాట్ ఓ మిస్టరీ కేసును కనిపెట్టగలిగారు.
ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..
బార్ (Bar) లో ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనే పోలీస్ ఇన్ఫార్మర్ కూర్చుని ఉన్నాడు. వారి సంభాషణపై దృష్టి పెట్టిన అతడికి ఓ కేసు మిస్టరీ గుర్తుకొచ్చింది. అంతే మహారాష్ట్ర (Maharashtra)లోని పుణె క్రైమ్ బ్యాంచ్ పోలీసులను అలర్ట్ చేశాడు. పోలీసులు బార్‌కు చేరుకుని 22 ఏళ్ల సిద్ధార్థ్ అనిల్ బాన్సోడ్.. అతని ఫ్రెండ్ శశి సురేష్ చరణ్(29)ను అదుపులోకి తీసుకున్నారు.
బాన్సోడ్, చరణ్ ఇద్దరూ మంగళ్వార్‌పేటలో నివాసం ఉంటారు. 2022 డిసెంబర్ 28న అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ఇద్దరూ రోడ్డుపై వెళ్తుండగా ఓ వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. అంతే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ తర్వాత వారిద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికే బాధితుడు కన్నుమూశాడు. అనంతరం పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా కేసు రాశారు. తాజాగా ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని విచారించగా మిస్టరీ బయటపడింది. బాధితుడ్ని చంపే ఉద్దేశంతో దాడి చేయలేదని తెలిపారు. రోడ్డుపై వెళ్తుండగా ఆ వ్యక్తి ఏదో గుసగుసలాడాడని.. తమను బూతులు తిట్టాడేమోనని అతనిపై పిడిగుద్దులు గుద్దినట్లు హంతకులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Cigarettes: ఇక్కడ దేవుడికి సిగరెట్లే నైవేద్యం.. ఇలా చేస్తేనే కోరికలు తీరతాయని అపారమైన నమ్మకం..!
రెండు నెలలుగా ఇద్దరూ ఈ హత్యపై సైలెంట్‌గా ఉన్నారు. పైగా దాడి జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా బార్‌లో చిట్ చాట్ ఈ మిస్టరీని ఛేదించేలా చేసింది. ఆ రాత్రి వారు ఆ బాధితుణ్ని ఎలా పిడిగుద్దులు గుద్దిందీ, ఎలా కొట్టిందీ.. బార్‌లో మాట్లాడుకున్నారు. పోలీసులు తమను కనుక్కోలేకపోయారని నవ్వుకున్నారు. కానీ వారికి దగ్గర్లోనే పోలీస్ ఇన్ఫార్మర్ కూర్చున్న విషయాన్ని వారు కనిపెట్టలేకపోయారు. మొత్తం మీద మత్తులో నిజాన్ని కక్కి కారాగారంలో ఊచలు లెక్కిస్తున్నారు.