Double Decker buses: హైదరాబాదీలకు పాత మధురస్మృతులు.. డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ వచ్చేశాయ్!..

ABN , First Publish Date - 2023-02-07T22:46:52+05:30 IST

ఏ కారణం వల్లనో కొన్నేళ్లక్రితం కనుమరుగయిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు.. తిరిగి మళ్లీ హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి. హైదరాబాద్ వాసులకు డబుల్ డెక్కర్ రోజులు మళ్లీ వచ్చేశాయి.

Double Decker buses: హైదరాబాదీలకు పాత మధురస్మృతులు.. డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ వచ్చేశాయ్!..

లనాటి హైదరాబాద్‌లో (Hyderabad) చార్మినార్, గోల్కొండకోట ఎంత ప్రసిద్ధో.. ఇక్కడి రోడ్లపై డబుల్ డెక్కర్ (Double Decker) బస్సులు కూడా అంతే ఫేమస్. ఈ బస్సుల్లో ప్రయాణాన్ని ఇష్టపడడమే కాకుండా.. వీటిని చూసేందుకు కూడా జనాలు అమితాసక్తిని కనబరిచేవారు. ప్రయాణికులు ప్రత్యేక అనుభూతిని ఆస్వాదించేవారు. ప్రత్యేక కల్చర్‌గా భావించేవారు. అయితే ఏ కారణం వల్లనో కొన్నేళ్లక్రితం కనుమరుగయిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు.. తిరిగి మళ్లీ హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి. హైదరాబాదీలు మళ్లీ డబుల్ డెక్కర్ మధురస్మృతులు పొందబోతున్నారు. మంత్రి కేటీఆర్ (KTR), చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మంగళవారం పచ్చజెండా ఊపి మూడు డబులు డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. బస్సులను పరిశీలించారు. కాగా ఇవి ఎలక్ట్రిక్ బస్సులు, అతిత్వరలోనే సిటీ రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకుపోనున్నాయి.

Untitled-10.jpg

మాట నిలబెట్టుకున్న కేటీఆర్..

డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి హైదరాబాద్‌లో పున:ప్రవేశపెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ రెండేళ్లక్రితం ఓ నెటిజన్‌కు ఇచ్చిన మాటను మంత్రి కేటీఆర్ నిలబెట్టుకున్నారు. షాకీర్‌హుస్సెన్ అనే ట్విటర్ యూజర్ నవంబర్ 7, 2020న ఓ పాత డబుల్ డెక్కర్ బస్సు ఫొటోను షేర్ చేశాడు. మంత్రి కేటీఆర్, తెలంగాణసీఎంవోలను ట్యాగ్ చేసి ‘‘ సార్ ఇది చూడండి. అఫ్జల్‌గంజ్, హైకోర్ట్ గుండా జూపార్క్ నుంచి సికింద్రాబాద్ ప్రయాణించిన 7జెడ్ డబుల్ డెక్కర్ బస్సు సభ్యుల్లో ఎవరికైనా గుర్తుందా?. సార్.. సిటీ పర్యాటకులు లేదా జనాల కోసం ఈ బస్సును మళ్లీ స్టార్ట్ చేయండి’’ అని అభ్యర్థించాడు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. అబిడ్స్‌లోని సెయింట్స్ జార్జ్ గ్రామర్ స్కూల్‌కు వెళ్లే మార్గంలో డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణానికి సంబంధించి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ బస్సులు రోడ్లపై తిరగకపోవడానికి కారణం ఏంటో తెలియదు. వీటిని రోడ్లుపై తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా ఉందా రవాణామంత్రి పువ్వాడ అజయ్ గారు?’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లపై చాలామంది స్పందించారు. డబుల్ డెక్కర్ బస్సుల్లో తమ ప్రయాణాలను గుర్తుచేసుకున్నారు. ఈ బస్సులను పున: ప్రవేశపెడితే సంతోషిస్తామంటూ చాలామంది అభిలాషించారు.

కేటీఆర్ మాటిచ్చిన రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే మంత్రి కేటీఆర్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఇక అతిత్వరలోనే ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించడమే తరువాయి. ఏయే రూట్లలో తిరగబోతున్నాయనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నో పర్యాటక ప్రదేశాలతోపాటు రోజురోజుకూ కొంగొత్త మెరుగులు దిద్దుకుంటున్న హైదరాబాద్‌కు ఈ డబుల్ డెక్కర్ బస్సులు తప్పకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనడంలో అతిశయోక్తిలేదు. ఇక ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో పర్యావరణానికి ఢోకా ఉండదు. మొత్తంగా డబుల్ డెక్కర్ ప్రయాణాన్ని హైదరాబాదీలు మళ్లీ ఆస్వాదించొచ్చన్నమాట.

Updated Date - 2023-02-08T00:42:18+05:30 IST