MA చదివింది కానీ 20 ఏళ్లుగా ఇంట్లోనే బందీ.. అన్నయ్య బయటకు వెళ్లి అడుక్కుని తెస్తున్న దాన్నే తింటూ.. చీకటిగదిలో మగ్గిపోతూ..
ABN , First Publish Date - 2023-03-18T15:55:28+05:30 IST
సంతోషంగా సాగుతున్న జీవితాల్లో కొన్నిసార్లు సడన్‌గా చోటు చేసుకునే ఘటనలు.. తీవ్ర విషాదాన్ని నింపుతుంటాయి. మరికొన్నిసార్లు బాగున్నవారిని బతికున్న జీవచ్ఛవాల్లా మార్చి కోలుకోలేని దెబ్బ కొడుతుంటాయి. తాజాగా...
సంతోషంగా సాగుతున్న జీవితాల్లో కొన్నిసార్లు సడన్‌గా చోటు చేసుకునే ఘటనలు.. తీవ్ర విషాదాన్ని నింపుతుంటాయి. మరికొన్నిసార్లు బాగున్నవారిని బతికున్న జీవచ్ఛవాల్లా మార్చి కోలుకోలేని దెబ్బ కొడుతుంటాయి. తాజాగా, హర్యానాలో వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఆమె ఎంఏ చదివింది.. కానీ 20 ఏళ్లుగా అన్నతో పాటూ ఇంట్లోనే బందీ అయింది. అప్పుడప్పుడూ అన్న బయటకు వెళ్లి అడుక్కుని తెస్తున్న దాన్ని తింటూ.. ఇద్దరూ చీకటి గదిలో కాలం వెళ్లదీస్తూ వచ్చారు. ఉన్నత విద్యావంతులైన వీరి పరిస్థితి ఇలా అవడానికి గల కారణాల్లోకి వెళితే..
హర్యానాలోని (Haryana) అంబాలా పరిధి బోహ్ గ్రామానికి చెందిన సూరజ్ ప్రకాష్ శర్మ అనే వ్యక్తి ఆయుర్వేద వైద్యుడిగా (Ayurvedic doctor) పని చేసేవారు. ఈయనకు ఇందు శర్మ అనే కూతురు, సునీల్ శర్మ అనే కొడుకు ఉన్నారు. సూరజ్ ప్రకాష్ శర్మ.. వైద్యుడు కావడంతో తన పిల్లలను కూడా బాగా చదివించారు. కూతురు ఇందు వర్మ ఎంఏ, బీఈడీ (MA, BEd) కూడా పాస్ అయింది. అయితే 20ఏళ్ల క్రితం సూరజ్ ప్రకాష్ శర్మ, అతడి భార్య మృతి చెందారు. దీంతో అప్పటి వరకూ బాగున్న వీరి కుటుంబంలో.. ప్రకాష్ శర్మ దంపతుల మృతితో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. బాగా చదువుకున్న పిల్లలు ఇద్దరూ తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురయ్యారు.
తల్లిదండ్రులు లేని లోటు వారిని తీవ్రంగా కుంగదీసింది. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్నారు. అది ఎంతలా అంటే.. ఇంటి నుంచి కాలు బయటికి పెట్టలేని విధంగా మారిపోయారు. కొన్నాళ్లకు ఇంటికి తాళం వేసుకుని అన్నాచెల్లెళ్లు ఇద్దరూ లోపలే ఉండిపోయారు. ఏళ్లు గడిచే కొద్దీ వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఏం తింటున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో తెలీని పరిస్థితిలోకి వెళ్లారు. సునీల్ శర్మ మాత్రం అప్పుడప్పుడూ బయటికి వెళ్లి.. పిచ్చి పట్టిన వాళ్లలా రోడ్ల వెంట తిరిగేవాడు. తెలిసిన వాళ్లు, బంధువులు అతడికి భోజనం పెడితే తినడం, అందులోనే కొంత ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాడు. ఇలా 20 ఏళ్లుగా ఈ అన్నాచెల్లెళ్లు ఇంట్లోనే బందీలుగా ఉండిపోయారు.
అయితే ఇటీవల ఓ స్వచ్ఛంద సేవా సంస్థ (charitable organization) నిర్వాహకులు వీరి గురించి తెలుసుకుని చలించిపోయారు. వెంటనే సదరు గ్రామానికి వెళ్లి వారిని రక్షించారు. 20ఏళ్లుగా బందీలుగా ఉండడంతో ఇళ్లు మొత్తం దుర్గంధంతో నిండిపోయింది. చివరికి వారిని బయటికి తీసుకొచ్చి, లూథియానాకు (Ludhiana) తరలించారు. వారి సంరక్షణ బాధ్యతలను తమ సంస్థే చూసుకుటుందని తెలిపారు. అదేవిధంగా పదేళ్లుగా అంబాలా వీధుల్లో పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతున్న అమన్ దీప్అనే యువకుడిని కూడా రక్షించారు. వారిని మెరుగైన చికిత్స అందించి, తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా, వీరికి సబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి.