అయ్యో.. నా తమ్ముడిని ఎవరో చంపేసి పారిపోయారంటూ గగ్గోలు పెట్టిన యువతి.. ఆమె పనేనని పోలీసులు ఎలా తేల్చారంటే..!
ABN , First Publish Date - 2023-02-15T21:00:32+05:30 IST
కొందరు పెద్ద పెద్ద నేరాలు చేసి కూడా ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంటారు. చివరకు పోలీసులకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్తలు పడుతుంటారు. చివరకు వారి నిజ స్వరూపం బయటపడ్డాక.. అందరూ అవాక్కవుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల..
కొందరు పెద్ద పెద్ద నేరాలు చేసి కూడా ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంటారు. చివరకు పోలీసులకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్తలు పడుతుంటారు. చివరకు వారి నిజ స్వరూపం బయటపడ్డాక.. అందరూ అవాక్కవుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అయ్యో.. నా తమ్ముడిని ఎవరో చంపేసి పారిపోయారంటూ.. ఓ యువతి గగ్గోలు పెట్టింది. మొదట్లో పోలీసులకు అనుమానం రాలేదు. అయితే చివరకు ఆమే నేరం చేసిందని ఎలా తెలుసుకున్నారంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాయ్‌బరేలీలోని భాదోఖర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఇంద్రపాల్ అనే వ్యక్తి.. పానిపట్‌లోని ఓ బట్టీలో పని చేస్తుంటాడు. ఇతడికి ఇధ్దరు కుమార్తెలు, 12ఏళ్ల కొడుకు ఉన్నారు. ఇంద్రపాల్ పెద్ద కూతురుకు సమీప గ్రామానికి చెందిన అనూజ్ జింగ్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కుటుంబ సభ్యులకు తెలీకుండా కలుసుకునేవారు. ఇలావుండగా, ఇటీవల ఓ రోజు ప్రేమికులిద్దరూ (lovers) సమీప పొలాల్లో అసభ్యకర స్థితిలో ఉండగా.. యువతి తమ్ముడు చూశాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెబుతానని అనడంతో యువతి, ఆమె ప్రియుడు భయపడిపోయారు. ఈ క్రమంలో ఇటీవల యువతి కుటుంబ సభ్యులు మొత్తం ఏదో పని మీద బయటి ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో తమ్ముడు ఒక్కడే ఉన్నాడు.
తన ప్రేమ విషయం ఇంట్లో చెబితే పరువు పోతుందని భావించి, చివరకు తమ్మున్ని చంపేయాలని నిర్ణయించుకుంది. చివరకు ప్రియుడితో కలిసి తమ్ముడిని గొడ్డలితో నరికి చంపేశారు. తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ.. అయ్యో! నా తమ్మున్ని ఎవరో చంపేశారంటూ బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలో ఇంట్లో ఓ ఫోన్ బయటపడింది. అందులో పరిశీలించగా.. యువతి తన ప్రియుడితో మాట్లాడిన కాల్ లిస్ట్ వివరాలు బయటపడ్డాయి. అనుమానం వచ్చి గట్టిగా విచారించగా.. చివరకు నేరం అంగీకరించారు. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, జైలుకు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.