రెండు టమాటాల కారణంగా విడిపోయిన దంపతులు కలిశారోచ్.. క్షమాపణగా భర్త ఏం చేశాడో తెలిస్తే నవ్వాగదు!..
ABN , First Publish Date - 2023-07-15T17:45:37+05:30 IST
తన అనుమతి లేకుండా భర్త కూరలో రెండు టమాటాలు ఎక్కువగా వేశాడని భార్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన గుర్తిందిగా.. అదేనండి మధ్యప్రదేశ్‌లోని షాదోల్ ఘటన. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా సుఖాంతమైంది.
భూపాల్: తన అనుమతి లేకుండా భర్త కూరలో రెండు టమాటాలు ఎక్కువగా వేశాడని భార్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన గుర్తిందిగా.. అదేనండి మధ్యప్రదేశ్‌లోని షాదోల్ ఘటన. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా సుఖాంతమైంది. భర్తను వదిలి వెళ్లిపోయిన భార్య మళ్లీ ఇంటికి చేరింది. ప్రాయశ్చితంగా భార్యకు సదరు భర్త అరకిలో టమాటాలను బహుమతిగా కూడా ఇచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన సందీప్ బర్మన్(Sanjeev Burman) భార్య ఆర్తి(Aarti) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆర్తి తన సోదరి ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె తిరిగి రావడానికి నిరాకరించింది. దీంతో ఆమెకు నచ్చజెప్పిన పోలీసులు తిరిగి తీసుకొచ్చారు. ధన్‌పురి పోలీస్ స్టేషన్‌లో భార్యభర్తలిద్దరిని పోలీసులు కలిపారు. ఈ క్రమంలో తనపై కోపంగా ఉన్న భార్యకు భర్త అరకిలో టమాటాలను బహుమతిగా ఇచ్చాడు. అలాగే ఇక నుంచి భార్య అనుమతి లేకుండా టమాటాలు వండనని ప్రమాణం చేశాడు. అలాగే భార్యభర్తలిద్దిరికీ పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. చిన్న విషయాలకు గొడవపడవద్దని సూచించారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోవాలని హితవు పలికారు.
అసలు ఏం జరిగిందంటే.. షాదోల్‌కు చెందిన సందీప్ బర్మన్ స్థానికంగా ఓ హోటల్ నిర్వహిస్తుంటాడు. అయితే, టిఫిన్ తయారు చేసే క్రమంలో కూర కోసం రెండు టమాటాలు వినియోగించాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సందీప్ భార్య, తమ కూతురితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఓ బస్సు ఎక్కింది. అప్పట్నించి ఆచూకీ లేకుండా పోయింది. చుట్టుపక్కల, బంధువుల వద్ద గాలించిన సందీప్.. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే ఆర్తి అచూకీని కునుగొన్న పోలీసులు భార్యభర్తలిద్దరినీ కలిపారు. దీంతో కథా సుఖాంతమైంది.