Credit: ఈజీగా క్రెడిట్ కార్డు పొందాలనుకునేవారికి ఉండాల్సిన అసలు అర్హతలు ఇవే!
ABN , First Publish Date - 2023-04-10T22:04:32+05:30 IST
మంచి క్రెడిట్ స్కోరు, స్థిరమైన ఆదాయ వనరు ఉంటే అధిక క్రెడిట్ పరిమితి, ఆకర్షణీయ రివార్డ్ ప్రోగ్రామ్స్‌తో క్రెడిట్ కార్డును సులభంగా పొందొచ్చు. అయితే ...
పేమెంట్లు చేసే విధానం సౌకర్యవంతంగా ఉండడంతో క్రెడిట్‌కార్డులు (Credit cards) చాలా పాపులర్ అయ్యాయి. అయితే క్రెడిట్ కార్డ్ పొందడం సులభమా లేదా సంక్లిష్టమా? అనే ప్రశ్నకు సమాధానం పలు అంశాల ఆధారంగా ఉంటుందని చెప్పాలి. మంచి క్రెడిట్ స్కోరు, స్థిరమైన ఆదాయ వనరు ఉంటే అధిక క్రెడిట్ పరిమితి, ఆకర్షణీయ రివార్డ్ ప్రోగ్రామ్స్‌తో క్రెడిట్ కార్డును సులభంగా పొందొచ్చు. అయితే తక్కువ క్రెడిట్ హిస్టరీ లేదా తక్కువ ఆదాయం ఉంటే మాత్రం కార్డు పొందడం కాస్త ఇబ్బందికరమనే చెప్పాలి. క్రెడిట్ లిమిట్ తక్కువగా ఉండడమే కాకుండా.. వడ్డీ రేటు కూడా అధికంగా ఉంటుంది.
క్రెడిట్ పొందేందుకు ఇలా చేయాలి...
1. యాక్టివ్ శాలరీ బ్యాంక్ అకౌంట్ ఉంటే క్రెడిట్ కార్డ్ కోసం బ్యాంక్‌ని సంప్రదించవచ్చు. మీ బ్యాంకింగ్ హిస్టరీ వారి వద్దే ఉంటుంది కాబట్టి ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌తో క్రెడిట్ కార్డ్ పొందొచ్చు.
2. ఒకవేళ మీకు అకౌంట్ ఉన్న బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డ్ ఆఫర్లు మీకు నచ్చకపోతే ఇతర బ్యాంకుల ఆఫర్ల గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు బ్యాంక్ బజార్ వంటి వెబ్‌సైట్లపై ఆఫర్లు సెర్చ్ చేయవచ్చు. ఇతర ఆఫర్లతో పోల్చి చూడవచ్చు. అందులో మీకు అర్హత ఉన్న క్రెడిట్ కార్డులు ఉండే అవకాశం కూడా ఉంది. తగిన ఆఫర్ ఉందనుకుంటే అవసరాలకు తగ్గట్టు అప్లై చేసుకోవాలి.
3. నాన్-శాలరీ దరఖాస్తుదారులైతే ప్రక్రియ కాస్త సంక్లిష్టంగానే ఉంటుందని చెప్పాలి. స్థిరమైన ఆదాయం లేకపోవడమే ఇందుకు కారణం. అధిక రిస్క్ ఉన్న రుణగ్రహితగా పరిగణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో హామీ అడిగే అవకాశం ఉంటుంది. డిపాజిట్‌లో 90 శాతం వరకు క్రెడిట్ కార్డులో వినియోగించేందుకు అవకాశాన్ని ఇస్తాయి.