Viral Video: అతడు చేసిన ఒక్క పనితో కొంగ మనసు కరిగిపోయింది.. బైక్‌పై వెళ్తున్నా సరే ఎగురుకుంటూ వెనకే వచ్చేస్తుంది..!
ABN , First Publish Date - 2023-02-24T16:43:52+05:30 IST
చిన్న సాయం చేసినా.. కొన్ని జంతువులు సదరు మనుషులపై జీవితాంతం ప్రేమను కనబరుస్తాయి. నిత్యం వారి వెన్నంటే ఉంటూ కృతజ్ఞతను చాటుతుంటాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..
కష్టకాలంలో కాపాడిన వాళ్ల పట్ల కృతజ్ఞత చూపని రోజులివి. కృతజ్ఞత చూపకపోగా సాయం చేసిన వారికే చివరకు వెన్నుపోటు పొడుస్తుంటారు. ఇలాంటి దుర్మార్గులు ఉన్న ఈ సమాజంలో జంతువులను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా జంతువులు మనుషుల పట్ల విశ్వాసంగా ఉండడాన్ని మనం రోజూ చూస్తూనే ఉంటాం. చిన్న సాయం చేసినా.. కొన్ని జంతువులు సదరు మనుషులపై జీవితాంతం ప్రేమను కనబరుస్తాయి. నిత్యం వారి వెన్నంటే ఉంటూ కృతజ్ఞతను చాటుతుంటాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ కొంగ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓ వ్యక్తి చేసిన చిన్న పనికి.. కొంగ మనసు కరిగిపోయింది. చివరకు బైక్‌పై వెళ్తున్నా సరే ఎగురుకుంటూ వెనకే వెళ్తోంది..
సోషల్ మీడియాలో మనిషితో స్నేహం చేసిన కొంగ వీడియో (Man and Stork Viral Videos) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అమేథీ పరిధి ఔరంగాబాద్‌లోని గౌరీగంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి.. ఏడాది క్రితం గాయపడిన ఓ కొంగను గమనించాడు. కొంగ కాలికి తీవ్ర గాయం అవడంతో వెంటనే స్పందించాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అంతే కాకుండా అది కోలుకునే వరకూ ఆహారం కూడా అందించాడు. అయితే కోలుకున్న కొంగ అక్కడి నుంచి వెళ్లలేదు. ఆరిఫ్ చేసిన సాయానికి కొంగ మనసు కరిగిపోయిందో ఏమో గానీ.. అప్పటి నుంచి అతడి వెన్నంటే ఉంది. దాని ప్రేమను గమనించిన ఆరిఫ్ కూడా కొంగను దగ్గరుండి చూసుకుంటున్నాడు.
ప్రస్తుతం ఇద్దరూ మంచి (man and stork Friendship) స్నేహితులయ్యారు. అది ఎంతగా అంటే.. ఆరిఫ్‌ను విడిచి ఆ కొంగ అసలు ఉండలేనంతగా మారిపోయింది. చివరకు అతను బైకుపై వెళ్లినా సరే.. ఎంత దూరమైనా వెనుకే వెళ్తుంది. ఇటీవల ఆరిఫ్ బైకుపై సుమారు 40కిలోమీటర్లు ప్రయాణించాడు. అతడి వెంటే కొంగ కూడా వెళ్లడాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి స్నేహాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మనుషుల కంటే పక్షులకే ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయని కొందరు, కల్మషం లేని వీరి స్నేహం చాలా అందంగా ఉందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.