వాష్ రూంకి వెళ్లాలని చెప్పి భర్తతో రూ.10లు తీసుకున్న నవ వధువు.. చివరకు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఆమె చేసిన నిర్వాకం..
ABN , First Publish Date - 2023-02-22T16:33:10+05:30 IST
కొడుక్కు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆ తల్లిదండ్రుల కోరిక. అనుకున్నట్లుగానే మంచి సంబంధం రావడంతో వెంటనే సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. అతిథుల సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం చేశారు. అన్నీ అనుకున్నట్లు జరగడంతో..
కొడుక్కు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆ తల్లిదండ్రుల కోరిక. అనుకున్నట్లుగానే మంచి సంబంధం రావడంతో వెంటనే సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. అతిథుల సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం చేశారు. అన్నీ అనుకున్నట్లు జరగడంతో మొక్కు చెల్లించుకునేందుకు అంతా కలిసి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అయితే ఈ క్రమంలో వారికి ఊహించని అనుభవం ఎదురైంది. నవ వధువు.. వాష్ రూంకి వెళ్లాలని చెప్పి భర్తతో రూ.10లు తీసుకుని వెళ్లింది. అయితే చివరకు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఆమె నిర్వాకం బయటపడింది. వివరాల్లోకి వెళితే..
యూపీలోని (Uttar Pradesh) మీర్జాపూర్ పరిధి జౌన్‌పూర్‌కు చెందిన యువకుడికి.. అజంగఢ్‌కు చెందిన యువతితో (young woman) ఫిబ్రవరి 10న వివాహమైంది. కొత్త కోడలు ఇంట్లోకి రాగానే అత్తమామల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోరుకున్నట్లుగానే కొడుకు వివాహం (marriage) జరగడంతో.. మొక్కు చెల్లించుకునేందుకు ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 19న కొడుకు, కోడలితో కలిసి వింధ్యవాసిని ఆలయానికి (Vindhyavasini Temple) వెళ్లారు. అంతా సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అంతే ఆనందంతో కుటుంబ సమేతంగా భోజనం చేయడానికి వెళ్లారు. అయితే కొత్త కోడలు, ‘‘ మీరు భోజనం చేస్తూ ఉండండి.. నేను వాష్‌రూం వెళ్లొస్తా’’.. అంటూ భర్తతో రూ.10లు తీసుకుని వెళ్లింది. అయితే భోజనాల వద్ద కోడలి కోసం చాలా సేపు ఎదురుచూసినా ఆమె మాత్రం ఎంతకీ రాలేదు. ఏమై ఉంటుందీ.. అని అనుకుంటూ భర్త చూడటానికి వెళ్లాడు.
వాష్‌రూం వద్ద కానీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో కానీ.. ఎక్కడా ఆమె కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. గంటలు గడుస్తున్నా ఆమె మాత్రం రాకపోవడంతో చివరకు చేసేదిలేక పోలీసులను ఆశ్రయించారు. సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించిన పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. గుడి నుంచి బయటికి వచ్చిన నవ వధువు కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లగా.. ఓ యువకుడు బైకులో అక్కడికి వచ్చాడు. వెంటనే ఆమె బండి ఎక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూడగానే అందరికీ విషయం అర్థమైంది. అనవసరంగా మోసపోయామే అంటూ నవ వధువు భర్తతో పాటూ అత్తమామలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాట్లాడుతూ ఇంతవరకూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రేమికుడితో పారిపోయిన నవ వధువు గురించి స్థానికులంతా వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు.