IND vs NEP: సీనియర్ పేసర్ ఎంట్రీ.. తిలక్ వర్మ కూడా.. నేపాల్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

ABN , First Publish Date - 2023-09-03T20:29:46+05:30 IST

ఆసియా కప్ 2023లో టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. సూపర్ 4 చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సోమవారం నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది.

IND vs NEP: సీనియర్ పేసర్ ఎంట్రీ.. తిలక్ వర్మ కూడా.. నేపాల్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

పల్లెకెలె: ఆసియా కప్ 2023లో టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. సూపర్ 4 చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సోమవారం నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది. మరో వైపు ఈ మ్యాచ్‌కు కూడా వర్షం నుంచి ముప్పు పొంచి ఉంది. వరుణుడు అడ్డుపడకపోతే పసికూన నేపాల్‌ను ఓడించడం భారత్‌కు పెదగా కష్టం కాకపోవచ్చు. ఇప్పటికే పాకిస్థాన్‌తో భారత్ ఆడిన గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఒక వేళ నేపాల్‌తో జరిగే మ్యాచ్ కూడా రద్దైనప్పటికీ భారత్ సూపర్ 4 చేరుతుంది. అయితే నేపాల్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి పసికూన కావడంతో సీనియర్లను పక్కనపెట్టి యువకులకు అవకాశం ఇస్తారా? లేదంటే ఎలాంటి మార్పులు లేకుండా గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నేపాల్‌తో పోరుకు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయ్యో ఒకసారి పరిశీలిద్దాం.


నేపాల్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో ప్రధానంగా ఒక మార్పు జరిగే అవకాశాలున్నాయి. లార్డ్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఆడించొచ్చు. ఎందుకంటే గత మ్యాచ్‌కు షమీని పక్కన పెట్టి బ్యాటింగ్‌లోనూ రాణించగలడని టీమ్ మేనేజ్‌మెంట్ శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. కానీ అతను 3 పరుగులు మాత్రమే చేశాడు. మిగతా బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన టాపార్డర్ నేపాల్‌తో మ్యాచ్‌లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కానీ ఒక వేళ కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటే తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కచ్చితంగా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఆడించొచ్చు. అప్పుడు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వొచ్చు. లేదంటే కెప్టెన్ రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చి.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టవచ్చు. అవసరమైతే జడేజాకు కూడా విశ్రాంతినిచ్చి అక్షర్ పటేల్‌ ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా యువ జట్టుతో బరిలోకి దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆసియా కప్ సూపర్ 4, వన్డే ప్రపంచకప్‌నకు ముందు బెంచ్ బలాన్ని పరిక్షించడానికి టీమిండియాకు ఇది మంచి అవకాశం. ఇవేవి కాకుండా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

టీమిండియా తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ/తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా/సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్/మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Updated Date - 2023-09-03T20:29:46+05:30 IST