Asia Cup: టీమిండియా అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్.. నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దు?

ABN , First Publish Date - 2023-09-03T16:25:12+05:30 IST

ఇప్పటికే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దైందని నిరాశలో అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన పల్లెకెల్లెలోని కాండీ మైదానంలోనే సోమవారం భారత్, నేపాల్ మధ్య కూడా మ్యాచ్ జరగాల్సి ఉంది.

Asia Cup: టీమిండియా అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్.. నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దు?

పల్లెకెలె: ఇప్పటికే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దైందని నిరాశలో అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన పల్లెకెల్లెలోని కాండీ మైదానంలోనే సోమవారం భారత్, నేపాల్ మధ్య కూడా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలున్నాయి. స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం.. సోమవారం పల్లెకెల్లెలో 80 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల మధ్య 60 శాతానికి పైగా వర్షం పడే అవకాశం ఉంది. రోజంతా 88 శాతం తేమ ఉండొచ్చు. రోజంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ నుంచి 27 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 65 శాతం వర్షం పడే అవకాశాలుండగా.. 80 శాతం తేమ ఉంటుందని సమాచారం. సాయంత్రం 4 గంటల సమయంలో 67 శాతం వర్షం పడే అవకాశాలుండగా.. 83 శాతం తేమ ఉండే అవకాశం ఉంది. రాత్రి 7 గంటల సమయంలో 70 శాతం వర్షం పడే అవకాశం ఉండగా.. 90 శాతం తేమ ఉండొచ్చు. రాత్రి 10 గంటల సమయలో 62 శాతం వర్షం పడే అవకాశాలుండగా.. 92 శాతం తేమ ఉండే అవకాశం ఉంది. ఇక రాత్రి 12 గంటల సమయంలో 24 శాతం వర్షం పడే అవకాశాలుండగా.. 91 శాతం తేమ ఉండే అవకాశాలున్నాయి.


దీంతో సోమవారం భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగడం కష్టంగానే కనబడుతోంది. అదే జరిగితే రెండు జట్లు చెరొక పాయింట్ పంచుకుంటాయి. ఇప్పటికే భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లు పాయింట్లు పంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో అలా భారత్ ఖాతాలో ఇప్పటికే ఒక పాయింట్ చేరింది. అప్పుడు భారత్ ఖాతాలో 2 పాయింట్లు ఉంటాయి. పాకిస్థాన్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో నేపాల్ ఓడిపోయింది. దీంతో భారత్‌తో జరిగే మ్యాచ్ రద్దైన ఆ జట్టు ఖాతాలో ఒకే ఒక పాయింట్ ఉంటుంది. అప్పుడు భారత్ సూపర్ 4లో అడుగుపెడుతుంది. టోర్నీలో నేపాల్ కథ ముగుస్తుంది. దీంతో లీగ్ స్టేజ్‌లో ఒక మ్యాచ్ కూడా గెలవకుండానే సూపర్ 4లో అడుగుపెట్టిన జట్టుగా భారత్ నిలవనుంది. కాగా గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే పాకిస్థాన్ సూపర్ 4కు చేరిన సంగతి తెలిసిందే. ఒక వేళ వర్షం పడకుండా మ్యాచ్ సజావుగా సాగితే భారత్, నేపాల్ పోటీలో గెలిచిన జట్టు సూపర్ 4లో అడుగుపెట్టనుంది. ఏది ఏమైనా మ్యాచ్ ఫలితం వరుణిడి చేతిలోనే ఉందని చెప్పుకోవాలి.

Updated Date - 2023-09-03T16:25:12+05:30 IST