Share News

Record Attendance: చరిత్ర సృష్టించిన 2023 ప్రపంచకప్.. 2015ను దాటేసింది..!!

ABN , First Publish Date - 2023-11-21T18:18:09+05:30 IST

ODI World Cup: ఇండియా వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ చరిత్ర సృష్టించింది. 2023 ప్రపంచకప్‌ను చరిత్రలో తొలిసారిగా 12,50,307 మంది స్టేడియాల్లో వీక్షించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ ఒక ఎడిషన్‌ను ఇంత మంది ఎప్పుడూ చూడలేదు. వరల్డ్ కప్ అనే కాదు. ఏ ఐసీసీ టోర్నీకి కూడా ఇంత మంది ప్రేక్షకులు హాజరు కాలేదు.

Record Attendance: చరిత్ర సృష్టించిన 2023 ప్రపంచకప్.. 2015ను దాటేసింది..!!

ఇండియా వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ చరిత్ర సృష్టించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 మధ్య ఇండియాలోని కీలక నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించగా అన్ని చోట్ల అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 10 నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరిగాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, తిరువనంతపురం, పుణె వంటి నగరాల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లను నిర్వహించగా అన్ని స్టేడియాలు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో 2023 ప్రపంచకప్‌ను చరిత్రలో తొలిసారిగా 12,50,307 మంది స్టేడియాల్లో వీక్షించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ ఒక ఎడిషన్‌ను ఇంత మంది ఎప్పుడూ చూడలేదు. వరల్డ్ కప్ అనే కాదు. ఏ ఐసీసీ టోర్నీకి కూడా ఇంత మంది ప్రేక్షకులు హాజరు కాలేదు.

అయితే తాజా ప్రపంచకప్‌కు 12 లక్షల మందికి పైగా హాజరు కాగా గతంలో 2015లో నమోదైన రికార్డు బద్దలైనట్లు ఐసీసీ తెలిపింది. 2015 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో నిర్వహించగా 10,16,420 మంది వీక్షించారు. దీంతో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌తో పోలిస్తే తాజా ప్రపంచకప్‌ను సుమారు 2 లక్షల మంది ఎక్కువగా స్టేడియాలకు వచ్చి వీక్షించారు. వాస్తవానికి న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ టాస్ సమయంలో స్టేడియంలో ఎక్కువ మంది ప్రేక్షకులు కనిపించలేదు. కానీ నెమ్మదిగా ఆ తర్వాత స్టేడియం హౌస్‌ఫుల్ అయ్యింది. ముఖ్యంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు 92,453 మంది స్టేడియానికి వచ్చి వీక్షించినట్లు ఐసీసీ తెలిపింది. కానీ ఇదే స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్‌తో పోలిస్తే ప్రపంచకప్ ఫైనల్‌కు తక్కువ మంది హాజరుకావడం గమనించాల్సిన విషయం. గుజరాత్, చెన్నై జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌కు 1,01,566 మంది హాజరైనట్లు బీసీసీఐ వెల్లడించింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-21T18:41:32+05:30 IST