Share News

ODI World Cup 2023: ప్రపంచకప్ ఫైనల్.. విమాన టిక్కెట్ ధరలు భారీగా పెంపు

ABN , First Publish Date - 2023-11-17T21:16:45+05:30 IST

Flight Tickets Rates: వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పలు విమానయాన సంస్థలు అదనపు విమానాలను నడుపుతున్నాయి.

ODI World Cup 2023: ప్రపంచకప్ ఫైనల్.. విమాన టిక్కెట్ ధరలు భారీగా పెంపు

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు వన్డే ప్రపంచకప్ ఫైనల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలని ప్రయత్నిస్తుండగా.. టీమిండియా ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్ వైపు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో హోటల్ గదుల అద్దె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సందట్లో సడేమియా తరహాలో విమానయాన సంస్థలు కూడా భారీగా టిక్కెట్ ధరలు పెంచేశాయి. శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పలు విమానయాన సంస్థలు అదనపు విమానాలను నడుపుతున్నాయి.

అయితే ఆయా విమానాల్లో ఛార్జీలు భారీగా ఉండటంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. అహ్మదాబాద్‌తో పాటు వడోదరకు వెళ్లే విమానాలకు కూడా డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లాలంటే రూ.14 వేల నుంచి రూ.39వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. అటు ముంబై-అహ్మదాబాద్ మధ్య విమానాల్లో కూడా టిక్కెట్ ధరలు రూ.10వేల నుంచి రూ.32 వేల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు- అహ్మదాబాద్ మార్గంలో కూడా విమాన టిక్కెట్ల ఛార్జీలు రూ. 26,999 నుంచి రూ. 33 వేల మధ్య ఉన్నట్లు పలు టిక్కెట్ పోర్టల్స్ ద్వారా స్పష్టం అవుతోంది. కాగా మోదీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ కోసం అతిరథ మహారథులు హాజరుకానుండటంతో బస్సులు, కార్ల ఛార్జీలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధానితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మ్యాచ్ చూసేందుకు హాజరవుతున్నారు. ఇంకా బాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలు కూడా అహ్మదాబాద్‌కు తరలివస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-17T21:16:47+05:30 IST