INDvsPAK: సెంచరీలతో చితక్కొట్టిన కోహ్లీ, రాహుల్.. పాకిస్థాన్ ముందు గట్టి టార్గెటే ఉంచారుగా..!

ABN , First Publish Date - 2023-09-11T18:56:14+05:30 IST

ఆసియాకప్‌ సూపర్‌-4లో భాగంగా ఆదివారం 147 పరుగుల భారత్ ఇన్నింగ్స్ దగ్గర వాయిదా పడిన భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్ సోమవారం కొనసాగింది. ఆదివారం మ్యాచ్ వాయిదా పడిన సమయానికి 24.1 ఓవర్ల వద్ద 2 వికెట్లకు 147 పరుగులు ఉండగా 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.

INDvsPAK: సెంచరీలతో చితక్కొట్టిన కోహ్లీ, రాహుల్.. పాకిస్థాన్ ముందు గట్టి టార్గెటే ఉంచారుగా..!

కొలంబో: ఆసియాకప్‌ సూపర్‌-4లో భాగంగా ఆదివారం 147 పరుగుల భారత్ ఇన్నింగ్స్ దగ్గర వాయిదా పడిన భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్ సోమవారం కొనసాగింది. ఆదివారం మ్యాచ్ వాయిదా పడిన సమయానికి 24.1 ఓవర్ల వద్ద 2 వికెట్లకు 147 పరుగులు ఉండగా 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. పాకిస్థాన్ ముందు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 84 బంతుల్లో 100 పరుగులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డే కెరీర్‌లో కోహ్లీ 47వ సెంచరీ నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా 100 బంతుల్లో 100 పరుగులు చేసి సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు మంచి స్కోర్ అందించారు.


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం దక్కడం గమనార్హం. ఓపెనర్లు గిల్‌, రోహిత్‌ చక్కటి సమన్వయంతో పాక్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆరంభంలో రోహిత్‌ కాస్త ఆచితూచి ఆడినా.. గిల్‌ మాత్రం ఫోర్లతోనే సమాధానమిచ్చాడు. షహీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడు, ఐదో ఓవర్లలో మూడేసి ఫోర్లతో చెలరేగాడు. కానీ పేసర్‌ నసీమ్‌ మాత్రం పరుగులను కట్టడి చేస్తూ మూడు ఓవర్లలో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఆత్మవిశ్వాసంతో కనిపించిన గిల్‌ వరుసగా రెండో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పదో ఓవర్‌లో రెండు ఫోర్లతో ట్రాక్‌ మీదికి వచ్చిన రోహిత్‌ ఆ తర్వాత కదం తొక్కాడు. స్పిన్నర్‌ షాదాబ్‌ ఓవర్‌లో వరుసగా 6,6,4తో 19 రన్స్‌ రాబట్టాడు. తన తర్వాతి ఓవర్‌లోనూ 6,4తో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇద్దరూ చక్కగా కుదురుకున్న వేళ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరడంతో తొలి వికెట్‌కు 121 పరుగుల శతక భాగస్వామ్యం ముగిసింది. రోహిత్‌ను షాదాబ్‌ అవుట్‌ చేయగా.. గిల్‌ను షహీన్‌ దెబ్బతీశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ 121 పరుగుల చక్కటి భాగస్వామ్యం కూడా టీమిండియా ఇంత స్కోర్ సాధించడానికి కలిసొచ్చింది.

రోహిత్ శర్మ 49 బంతుల్లో 56 పరుగులు, శుభ్‌మన్ గిల్ 52 బంతుల్లో 58 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 122, రాహుల్ 106 బంతుల్లో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రీది, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ కొంత ఆలస్యంగా మొదలైనప్పటికీ మిగిలిన భారత్ ఇన్నింగ్స్‌‌కు వరుణుడు అడ్డంకి సృష్టించకపోవడంతో అభిమానులు విరాట్ కోహ్లీ, రాహుల్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశారు. 357 పరుగుల లక్ష్యంతో పాకిస్థాన్ బ్యాటింగ్‌కు దిగనుంది. పాక్ బౌలర్లలో కీలకమైన షాహిన్ అఫ్రీదీనే మిగిలిన బౌలర్ల కంటే ఎక్కువగా 10 ఓవర్లకు 79 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

Updated Date - 2023-09-11T19:09:06+05:30 IST