Share News

AUS vs SL: ఎట్టకేలకు వరల్డ్‌ కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై ఘనవిజయం

ABN , First Publish Date - 2023-10-16T21:56:22+05:30 IST

ఈ వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచెస్‌లో ఘోర పరాభవాల్ని చవిచూసిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. లక్నోలోని ఏకనా స్పోర్ట్స్ సిటీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజయకేతనం...

AUS vs SL: ఎట్టకేలకు వరల్డ్‌ కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై ఘనవిజయం

ఈ వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచెస్‌లో ఘోర పరాభవాల్ని చవిచూసిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. లక్నోలోని ఏకనా స్పోర్ట్స్ సిటీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజయకేతనం ఎగరవేసింది. లంక జట్టు నిర్దేశించిన 210 లక్ష్యాన్ని ఆసీస్ జట్టు 35.2 ఓవర్లలోనే (215) ఛేధించి, తన తొలి విజయాన్ని నమోదు చేసింది. మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లీస్ (58) అర్థశతకాలతో రాణించడం.. లబుషేన్ (40)తో పాటు మ్యాక్స్‌వెల్ (31), స్టోయినిస్ (20) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో.. ఆసీస్ జట్టు ఈ గెలుపును సొంతం చేసుకోగలిగింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక జట్టు 43.3 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిజానికి.. శ్రీలంక ఓపెనర్లు నిస్సాంకా (61), కుశల్ పెరీరా (78) ఆడిన తీరు చూసి.. శ్రీలంక భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. వాళ్లిద్దరు క్రీజులో ఉన్నంతసేపూ.. ఆసీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఆచితూచి ఆడుతూ.. వీలు దొరికినప్పుడల్లా బంతుల్ని బౌండరీల దిశగా పంపిస్తూ వచ్చారు. తొలి వికెట్‌కి వీళ్లు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అది కూడా 21.4 ఓవర్లలోనే. ఆ ఇద్దరు ఇంత అద్భుతమైన శుభారంభాన్ని అందించారు కాబట్టి.. ఇతర శ్రీలంక బ్యాటర్లు మరింత విజృంభించడం ఖాయమని, స్కోరు 300 పైచిలుకే చేస్తారని అంతా భావించారు. కానీ.. అసలంక (25) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఏ ఒక్కరూ క్రీజులో ఎక్కువసేపు నిలకడగా రాణించలేకపోయారు. వచ్చినవారు వచ్చినట్లుగానే పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. 209 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అవ్వాల్సి వచ్చింది.

ఇక 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 35.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి గెలుపొందింది. మొదట్లో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగే వేశారు. వార్నర్ 11 పరుగులకే ఔట్ అవ్వగా, ఆ వెంటనే స్మిత్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో ఆసీస్ జట్టు కష్టాల్లో పడినట్టయ్యింది. అప్పుడు మార్ష్, లబుషేన్ కలిసి మంచి భాగస్వామ్యం ఏర్పరిచారు. అర్థశతకం చేసిన వెంటనే మార్ష్ ఔటయ్యాడు. అతని తర్వాత వచ్చిన జోష్, లబుషేన్ కలిసి జట్టుని ముందుకు నడిపించారు. వాళ్లిద్దరు పెవిలియన్ చేరాక.. మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ సునాయాసంగా మ్యాచ్‌ని ముగించేశారు. చివర్లో స్టోయినిస్ సిక్స్ కొట్టి.. తన ఆసీస్ జట్టుని గెలిపించాడు. మరి, ఇదే విన్నింగ్ స్ట్రీక్‌ని ఆస్ట్రేలియా మున్ముందు మ్యాచెస్‌లోనూ కొనసాగిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Updated Date - 2023-10-16T21:56:22+05:30 IST