Asian Games 2023: పాకిస్థాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. కాంస్య పతకం కైవసం
ABN , First Publish Date - 2023-10-07T20:26:59+05:30 IST
ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పురుషుల క్రికెట్ ఈవెంట్‌లో శనివారం నాడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పురుషుల క్రికెట్ ఈవెంట్‌లో శనివారం నాడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుని పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కానీ పాకిస్థాన్ వేగంగా ఆడలేకపోయింది. ఐదు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి కేవలం 48 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో భారీ వర్షం కురిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ సాగలేదు. ఈ నేపథ్యంలో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను ఐదు ఓవర్లలో 65 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: Asian Games 2023: వర్షం వల్ల ఫైనల్ రద్దు.. అయినా టీమిండియాకు గోల్డ్ మెడల్
ఈ టార్గెట్ ఛేదించడం బంగ్లాదేశ్‌కు కష్టమే అని అందరూ భావించారు. అయితే అఫిఫ్ హుస్సేన్, యాసిర్ అలీ అసాధారణ పోరాటం చేశారు. అఫిఫ్ హుస్సేన్ 11 బంతుల్లో 20 పరుగులు చేయగా.. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్‌లో అవకాశం దక్కని యాసిర్ అలీ 16 బంతుల్లో 34 పరుగులు చేసి తమ జట్టును విజయానికి చేరువ చేశారు. దీంతో బంగ్లాదేశ్ గెలవాలంటే చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో యాసిర్ అలీ తొలి నాలుగు బంతుల్లో 18 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. దీంతో పాకిస్థాన్ టీమ్ ఊపిరి పీల్చుకుంది. చివర్లో వచ్చిన రకిబుల్ హాసన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదడంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.