World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జైషా
ABN , First Publish Date - 2023-10-05T16:22:18+05:30 IST
వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడడానికి మైదానాలకు వచ్చే ప్రేక్షకులకు బీసీసీఐ కార్యదర్శి జైషా శుభవార్త చెప్పారు. స్టేడియంలో ప్రేక్షకులకు ఉచితంగా తాగు నీరు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు.
వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడడానికి మైదానాలకు వచ్చే ప్రేక్షకులకు బీసీసీఐ కార్యదర్శి జైషా శుభవార్త చెప్పారు. స్టేడియంలో ప్రేక్షకులకు ఉచితంగా తాగు నీరు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జైషా ఎక్స్(ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘‘ మేము భారతదేశం అంతటా స్టేడియాలలో ప్రేక్షకుల కోసం ఉచిత మినరల్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను అందిస్తున్నామని ప్రకటించడానికి గర్వపడుతున్నాను. హైడ్రేటెడ్ గా ఉండండి. ఆటలను ఆస్వాదించండి! వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగా మరిచిపోలేని జ్ఞాపకాలను సృష్టిద్దాం.’’ అని ట్వీట్ చేశారు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది.
న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో 118 పరుగులకే ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్ మొదటి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. అయితే 8వ ఓవర్లో మ్యాట్ హెన్రీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 14 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో(33)ను మిచెల్ శాంట్నర్ ఔట్ చేశాడు. 17వ ఓవర్లో హ్యారీ బ్రూక్(25)ను రచీన్ రవీంద్ర ఔట్ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన బ్రూక్ 16 బంతుల్లోనే 25 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. మొయిన్ అలీ కూడా 11 పరుగులకే ఔట్ కావడంతో ఇంగ్లండ్ 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌ను కెప్టెన్ బట్లర్‌తో కలిసి జో రూట్ ఆదుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 50+ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో జో రూట్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా వన్డే కెరీర్‌లో బ్రూక్‌కు ఇది 37వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం 31 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.