Chahal: ఆర్సీబీపై చాహల్ సంచలన వ్యాఖ్యలు.. ఒక్క ఫోన్ కూడా చేయలేదు
ABN , First Publish Date - 2023-07-16T20:17:28+05:30 IST
తన మాజీ ఫ్రాంచైజీపై చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు. 8 ఏళ్లు తాను ఆర్సీబీ తరఫున ఆడితే 2022లో రిటైన్ చేసుకునే సమయంలో కనీసం తనను మేనేజ్మెంట్ సంప్రదించలేదని చాహల్ ఆరోపించాడు. కనీసం ఒక్క ఫోన్ కూడా తనకు ఆర్సీబీ నుంచి రాకపోవడం చాలా బాధాకరంగా అనిపించిందని తెలిపాడు.
ఐపీఎల్(IPL)లో విజయవంతమైన బౌలర్లలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తప్పకుండా ఉంటాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఆడిన చాహల్ గత రెండేళ్లుగా రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals)కు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన మాజీ ఫ్రాంచైజీపై చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు. 8 ఏళ్లు తాను ఆర్సీబీ తరఫున ఆడితే 2022లో రిటైన్ చేసుకునే సమయంలో కనీసం తనను మేనేజ్మెంట్ సంప్రదించలేదని చాహల్ ఆరోపించాడు. దీంతో తనకు చాలా కోపం వచ్చిందని అన్నాడు. కనీసం ఒక్క ఫోన్ కూడా తనకు ఆర్సీబీ నుంచి రాకపోవడం చాలా బాధాకరంగా అనిపించిందని తెలిపాడు.
2022 వేలానికి ముందు తాను ఆర్సీబీకే ఆడాలనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో చాహల్ తన మనసులోని మాటను బయటకు చెప్పాడు. కానీ ఆర్సీబీ మాత్రం చాహల్‌ను రిటైన్ చేసుకోకుండా టీమ్ నుంచి విడుదల చేసింది. తనను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదని తెలియగానే నిరుత్సాహానికి గురైనట్లు తాజాగా ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ వెల్లడించాడు. నిజానికి ఆర్సీబీ తనకు చాలా అవకాశాలు ఇచ్చిందని.. ఆర్సీబీలో సత్తా చాటడంతోనే తాను టీమిండియాకు ఎంపికయ్యానని చాహల్ అన్నాడు. ఆర్సీబీలో తనకు విరాట్ కోహ్లీ చాలా మద్దతు ఇచ్చేవాడు అని.. అతడు తనపై చాలా నమ్మకం పెట్టుకునేవాడు అని వివరించాడు.
ఇది కూడా చదవండి: India vs Bangladesh: వన్డే క్రికెట్ చరిత్రలో భారత అమ్మాయిలకు తొలి ఓటమి
కాగా ఆర్సీబీ తరఫున తాను దాదాపు 140 మ్యాచ్‌లు ఆడానని చాహల్ వెల్లడించాడు. అయితే ఉన్నట్టుండి తనను రిటైన్ చేసుకోవడం లేదనే సరికి తనకు ఏమీ అర్థం కాలేదన్నాడు. రిటైన్ చేసుకోకపోయినా వేలంలో దక్కించుకుంటామని ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రామిస్ చేసిందని.. కానీ వేలంలో తన తరఫున ఒక్క బిడ్ కూడా వేయకపోవడం నిరుత్సాహానికి గురిచేసిందని చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. 8 ఏళ్లు ఆర్సీబీ కోసం చేయాల్సిందంతా చేశానని.. ఇప్పటికీ చిన్నస్వామి స్టేడియం తన ఫేవరేట్ గ్రౌండ్ అని చాహల్ చెప్పాడు. అయితే తనకు అంతా మంచే జరిగిందని.. రాజస్థాన్ రాయల్స్‌తో చేరిన తర్వాత తన వ్యక్తిగత ప్రదర్శన మరింత మెరుగుపడిందని పేర్కొన్నాడు.