ODI World Cup: ఇంగ్లండ్‌కు ఇంకా సెమీస్ అవకాశాలు.. అంతా ఇలా జరగాలి..!!
ABN , First Publish Date - 2023-10-30T21:33:49+05:30 IST
మెగా టోర్నీలో దారుణ ప్రదర్శన చేస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాలి. నవంబర్ 4న ఆస్ట్రేలియాతో, నవంబర్ 8న నెదర్లాండ్స్‌తో, నవంబర్ 11న పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది.
వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన చేస్తోంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు అనంతరం ఆప్ఘనిస్తాన్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది. అక్కడి నుంచి వరుస వైఫల్యాలను కొనసాగిస్తోంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై మాత్రమే ఇంగ్లండ్ గెలుపు తన ఖాతాలో వేసుకుంది. అయినా ఇంకా ఇంగ్లండ్‌కు సాంకేతికంగా సెమీస్ అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అద్భుత రీతిలో తర్వాతి మూడు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ గెలవడమే కాకుండా ప్రస్తుతం 3, 4, 5 స్థానాల్లో ఉన్న జట్లు అన్ని మ్యాచ్‌లలో ఓడిపోతే అప్పుడు సెమీస్ అవకాశాలు ఉంటాయని వివరిస్తున్నారు.
మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాలి. నవంబర్ 4న ఆస్ట్రేలియాతో, నవంబర్ 8న నెదర్లాండ్స్‌తో, నవంబర్ 11న పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది. ప్రస్తుత ప్రదర్శన దృష్ట్యా ఆస్ట్రేలియాపై గెలవాలంటే బట్లర్ సేన అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్‌తో గెలిచినా.. పాకిస్థాన్‌పై గెలవడం మాత్రం అంత సులభమేమీ కాదు. పాకిస్థాన్ కూడా ఇంచుమించు ఇంగ్లండ్ లాంటి పరిస్థితుల్లోనే ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. మరోవైపు పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో్ ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు తలో 8 పాయింట్లు తమ ఖాతాలో ఉన్నాయి. న్యూజిలాండ్ నవంబర్ 1న దక్షిణాఫ్రికాతో, నవంబర్ 4న పాకిస్థాన్‌తో, నవంబర్ 9న శ్రీలంకతో ఆడాలి. అలాగే ఆస్ట్రేలియా నవంబర్ 4న ఇంగ్లండ్, నవంబర్ 7న ఆప్ఘనిస్తాన్, నవంబర్ 11న బంగ్లాదేశ్‌తో తలపడాలి. ఆస్ట్రేలియా ఈ మూడింట్లో రెండు విజయాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండే ఛాన్స్ ఉంది. నాలుగో స్థానం కోసం ఇంగ్లండ్ తీవ్రంగా కష్టపడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ మెగా టోర్నీలో ఇంగ్లండ్ గమనాన్ని నిర్దేశించనుంది.