ODI World Cup: ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం.. 38 గంటలు విమానంలోనే..!!
ABN , First Publish Date - 2023-09-29T21:57:55+05:30 IST
ఇంగ్లండ్ జట్టుకు మాత్రం తమ ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో విమానంలో ప్రయాణించారు.
వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అన్ని జట్లు భారత్ చేరుకుంటున్నాయి. అయితే ఇంగ్లండ్ జట్టుకు మాత్రం తమ ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో విమానంలో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే ఇన్ని గంటలు ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందో అన్న విషయాన్ని మాత్రం అతడు చెప్పలేదు. తమ ప్రయాణంపై మాత్రం అతడు అసహనం వ్యక్తం చేశాడు. విమానంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంతసేపు ప్రయాణించడం తీవ్ర అయోమయానికి గురిచేసిందన్నాడు. ఇతర ప్రయాణికులతో కలిసి ఒకే విమానంలో భారత్‌కు చేరుకున్నామని బెయిర్ స్టో తెలిపాడు.
ఇది కూడా చదవండి: Cricket News: బంగ్లాదేశ్ జట్టులో రచ్చ.. ఇద్దరు ప్రధాన ఆటగాళ్ల మధ్య విభేదాలు
కాగా సోషల్ మీడియాలో బెయిర్ స్టో షేర్ చేసిన ఫోటోలలో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్, క్రిస్ వోక్స్ కనిపించారు. వారిద్దరితోపాటు ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు గౌహతిలో ఉన్నారు. శనివారం నాడు టీమిండియాతో ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్‌లో తలపడనుంది. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన ఇంగ్లండ్ ఆటగాళ్లు వార్మప్ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. 2019లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై సూపర్ ఓవర్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. రెండు సార్లు సూపర్ ఓవర్ టై కావడంతో బౌండరీల తేడాతో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా అవతరించింది.