Gautham Gambhir: రోహిత్ సిసలైన లీడర్.. అతడు కోహ్లీ లాంటి రకం కాదు..!!
ABN , First Publish Date - 2023-10-30T18:55:50+05:30 IST
ఓపెనర్ స్థానంలో రోహిత్ చాలా నిస్వార్థంగా ఆడుతున్నాడని గంభీర్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ పరంగా, ఆటపరంగా జట్టును ముందుడి నడిపిస్తున్న రోహిత్ శర్మ... ఏనాడూ సెంచరీల కోసం వెంపర్లాడటం తాను చూడలేదని పేర్కొన్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటు ఓపెనర్‌గా.. అటు నాయకుడిగా రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. అవసరం వచ్చినప్పుడు నెమ్మదిగా ఆడుతూ.. పరిస్థితులు అనుకూలిస్తే దూకుడుగా ఆడుతూ జట్టుకు పరుగులు అందిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ను తీసుకుంటే జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించాడు. మరో ఎండ్‌లో వరుసగా మూడు వికెట్లు పడటంతో కేఎల్ రాహుల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్ విలువైన 87 పరుగులు చేయడంతో టీమిండియా 229 పరుగుల మోస్తరు స్కోరు సాధించగలిగింది. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు చాలామంది కెప్టెన్లు వచ్చారు కానీ... రోహిత్ శర్మ మాత్రం సిసలైన లీడర్ అంటూ కొనియాడాడు. ఇదే సమయంలో... కెప్టెన్‌కు, లీడర్‌కు చాలా తేడా ఉందని గంభీర్ వివరించాడు.
నిజంగా చెప్పాలంటే ఓపెనర్ స్థానంలో రోహిత్ చాలా నిస్వార్థంగా ఆడుతున్నాడని గంభీర్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ పరంగా, ఆటపరంగా జట్టును ముందుడి నడిపిస్తున్న రోహిత్ శర్మ... ఏనాడూ సెంచరీల కోసం వెంపర్లాడటం తాను చూడలేదని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు రోహిత్ రెండు సార్లు 80+ స్కోర్లలో అవుట్ అయ్యాడని.. అతడు సెంచరీల కోసం ప్రయత్నించి ఉంటే అతడి ఖాతాలో మొత్తం మూడు సెంచరీలు ఉండేవని గుర్తుచేశాడు. రోహిత్ కూడా సెంచరీల కోసం ప్రయత్నించి ఉంటే వన్డేల్లో ఇప్పటివరకు అతడి ఖాతాలో 40-45 సెంచరీలు ఉండేవని గంభీర్ అభిప్రాయపడ్డాడు. దీంతో గంభీర్ ఇన్‌డైరెక్టుగా కోహ్లీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆప్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లలో కోహ్లీ సెంచరీ కోసం ప్రయత్నించడంపై ఇప్పటికే పుజారా లాంటి ఆటగాళ్లు విమర్శలు చేశారు. ఇప్పుడు గంభీర్ కూడా అలాంటి విమర్శలే చేయడంతో రోహిత్, కోహ్లీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పోటాపోటీ కామెంట్లు నడుస్తున్నాయి. కాగా 2023లో వన్డేల్లో రోహిత్ 80కి పైగా స్కోర్లు చేసి నాలుగుసార్లు అవుటయ్యాడని అతడి అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 86 పరుగులకు అవుటైన రోహిత్.. ఇంగ్లండ్‌పై 87 పరుగులకు పెవిలియన్ చేరాడు. అంతేకాకుండా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లలోనూ 46, 48 పరుగులు చేసిన రోహిత్ హాఫ్ సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయాడు.