ICC World Cup Team: ఐసీసీ బెస్ట్ ఎలెవన్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు
ABN , First Publish Date - 2023-11-20T17:36:58+05:30 IST
ICC Best Team: వన్డే ప్రపంచకప్ ముగియడంతో ఐసీసీ అన్ని జట్ల నుంచి బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా నుంచి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఫైనల్లో విఫలమైనా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకుంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఆరోసారి ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడగా.. టీమిండియా రన్నరప్స్‌గా నిలిచింది. ఇప్పుడు ఐసీసీ అన్ని జట్ల నుంచి బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా నుంచి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. మెగా టోర్నీలో సత్తా చాటిన భారత ఆటగాళ్ల ప్రదర్శనను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకుంది. ప్రపంచకప్ ఫైనల్స్‌లో జట్టును విజయ తీరాలకు చేర్చడంలో విఫలమైనప్పటికీ.. అతడి ప్రతిభను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేమని ఐసీసీ పేర్కొంది. కెప్టెన్‌గానే కాకుండా ఓపెనర్‌గానూ రోహిత్ శర్మ రాణించాడని కితాబు ఇచ్చింది. రోహిత్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన విరాట్ కోహ్లీ, అత్యధిక వికెట్లు సాధించిన షమీని కూడా ఐసీసీ ఎంపిక చేసింది.
మిగతా జాబితాలో దక్షిణాఫ్రికా నుంచి ఒకరు, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరికి, న్యూజిలాండ్ నుంచి ఒకరు, శ్రీలంక నుంచి ఒకరిని ఎంచుకుంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఆప్ఘనిస్తాన్ ఆటగాళ్లకు ఐసీసీ బెస్ట్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు.
ఐసీసీ బెస్ట్ ఎలెవన్ టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్, భారత్), డికాక్ (దక్షిణాఫ్రికా), విరాట్ కోహ్లీ (భారత్), డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), రవీంద్ర జడేజా (భారత్), జస్‌ప్రీత్ బుమ్రా (భారత్), దిల్షాన్ మధుశంక (శ్రీలంక), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), మహ్మద్ షమీ (భారత్)
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.