Harmanpreet Kaur: టీమిండియా కెప్టెన్‌కు ఐసీసీ షాక్.. రెండు మ్యాచ్‌లు నిషేధం?
ABN , First Publish Date - 2023-07-23T18:34:49+05:30 IST
బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్‌పై ఐసీసీ నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని క్రిక్ బజ్ ఓ కథనం ప్రచురించింది. ఇదే నిజమైతే హర్మన్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది.
టీమిండియా (Team India) మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్(Harman Preethkaur)కు ఐసీసీ (ICC) షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్(Bangladesh)తో శనివారం జరిగిన మూడో వన్డేలో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్ బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. దీంతో ఐసీసీ నియమావళి ప్రకారం హర్మన్‌పై చర్యలు ఉంటాయని క్రిక్ బజ్ (Cricbuzz) ఓ కథనం ప్రచురించింది. ఇదే నిజమైతే హర్మన్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది. మైదానంలో హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుగా ప్రవర్తించినందుకు 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు విధించాలని ఐసీసీ నిర్ణయించిందని.. అలాగే పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో అంపైర్ల నిర్ణయాలను తప్పుబట్టడంపై ఓ డీమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజులో మరో 20 శాతం కోత విధించేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు క్రిక్ బజ్ తన కథనంలో పేర్కొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం 12 నెలల్లో నాలుగు డీమెరిట్ పాయింట్లు వస్తే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడకుండా నిషేధిస్తారు. ఈ లెక్క ప్రకారం హర్మన్ ప్రీత్ ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ చేరితే ఆమె రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొనుంది.
కాగా బంగ్లాదేశ్-భారత్ మధ్య శనివారం జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. ముఖ్యంగా అంపైర్ల నిర్ణయాల కారణంగానే గెలవాల్సిన మ్యాచ్‌లో తాము ఓడిపోయామని టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ ఆరోపణలు చేసింది. ఈ టోర్నీలో డీఆర్ఎస్ కూడా లేకపోవడం తమకు నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఎల్‌బీడబ్ల్యూ విషయంలో అంపైర్ సెకన్ కూడా ఆలోచించకుండా ఔట్ ఇవ్వడం పట్ల హర్మన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంపైర్లు సరైన నిర్ణయాలు తీసుకోవాలని.. కొన్ని సార్లు వాళ్లు తీసుకునే నిర్ణయాలపై స్పష్టత ఎంతో ముఖ్యమని అభిప్రాయపడింది. తాను ఔట్ కాకపోయినా అంపైర్ ఔట్ ఇవ్వడంపై ఐసీసీ, బీసీసీఐ, బీసీబీ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మ్యాచ్‌లో అంపైరింగ్ చెత్తగా ఉందని, అంపైర్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని హర్మన్ ఆరోపించింది. మరోసారి బంగ్లాదేశ్ వచ్చే ముందు అంపైర్లతో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకుని వస్తామని సెటైర్లు పేల్చింది.
ఇది కూడా చదవండి: Viral Video: టీమిండియా క్రికెటర్లతో ఫోటోలకు పోజులిచ్చిన మిస్ వరల్డ్ బ్యూటీ