IND vs SA: శ్రీలంక దిగ్గజ బౌలర్ రికార్డును బద్దలు కొట్టేందుకు అడుగు దూరంలో రవీంద్ర జడేజా
ABN , First Publish Date - 2023-12-12T07:53:46+05:30 IST
Ravindra Jadeja: సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దు కావడంతో రెండో టీ20పై ఆసక్తి నెలకొంది. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది.
ఎబేహ: సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దు కావడంతో రెండో టీ20పై ఆసక్తి నెలకొంది. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది. వరల్డ్‌కప్‌నకు ముందు తమ జట్లను అన్ని విధాలుగా బల పరచుకునేందుకు భారత్, సౌతాఫ్రికాకు సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లు కీలకం. దీంతో ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా మరో 6 నెలల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో చోటు ఆశిస్తున్న యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో రాణించేందుకు తహతహలాడుతున్నారు. దీంతో వరుణుడి కరుణిస్తే ఒక మంచి మ్యాచ్ చూసే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ రికార్డును చేరుకునే అవకాశాలున్నాయి. జడ్డూ మరొక వికెట్ తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ లసిత్ మలింగ రికార్డును బద్దలుకొడతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 328 మ్యాచ్‌లాడిన రవీంద్ర జడేజా 546 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 275, వన్డేల్లో 220, టీ20ల్లో 51 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 340 మ్యాచ్‌లాడిన శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ కూడా 546 వికెట్లు తీశాడు. మలింగ టెస్టుల్లో 101, వన్డేల్లో 338, టీ20ల్లో 107 వికెట్లు తీశాడు. జడేజా మరో వికెట్ తీస్తే లసిత్ మలింగను అధిగమిస్తాడు. దీంతో సౌతాఫ్రికాతో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లోనే జడేజా ఈ రికార్డును అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఏడో స్థానంలో ఉన్నాడు. 956 వికెట్లు తీసిన మాజీ బౌలర్ అనిల్ కుంబ్లే ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా జడేజా మరో 6 వికెట్లు తీస్తే 551 వికెట్లు తీసిన శ్రీనాథ్‌ను అధిగమించి ఈ జాబితాలో ఆరో స్థానానికి చేరుకుంటాడు.