India vs Sri Lanka: చిత్తుగా ఓడిన లంక.. భారత్ ఖాతాలో భారీ విజయం

ABN , First Publish Date - 2023-01-15T20:09:54+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక (Sri Lanka)తో ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చిత్తుగా ఓడింది.

India vs Sri Lanka: చిత్తుగా ఓడిన లంక.. భారత్ ఖాతాలో భారీ విజయం

తిరువనంతపురం: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక (Sri Lanka)తో ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చిత్తుగా ఓడింది. భారత్ (Team India) నిర్దేశించిన 391 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 73 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 317 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

శుభమన్ గిల్ (116), కోహ్లీ (166 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన లంక ఆది నుంచే తడబడింది. శ్రీలంక బ్యాటర్లను హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) తొలుత చావుదెబ్బ కొట్టాడు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ టాపార్డర్‌ను పెవిలియన్ పంపాడు. నిప్పుల్లా దూసుకొస్తున్న అతడి బంతులను ఎదుర్కోలేకపోయిన లంక బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేరారు. ఫలితంగా 39 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. షమీ రెండు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకుని మిగతా పని పూర్తి చేశారు. లంక బ్యాటర్లలో నువనిదు ఫెర్నాండో చేసిన 19 పరుగులకే జట్టులో అత్యధికం అంటే శ్రీలంక బ్యాటర్ల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాసున్ రజత 13, కెప్టెన్ దాసున్ షనక 11 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ చెలరేగిపోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (42), శుభమన్ గిల్ (116) కలిసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించి పునాది వేశారు. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) ఒకనాటి కోహ్లీని గుర్తుకు తెచ్చాడు. క్రీజులో కుదురుకున్నంత వరకు నిదానంగా ఆడి ఆ తర్వాత పూనకం వచ్చిన వాడిలో ఊగిపోయాడు. బ్యాట్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో వన్డేల్లో 46వ వన్డే పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 166 పరుగులు చేశాడు. మరోవైపు, శుభమన్ గిల్ (Shubman Gill) కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు చేశాడు.

ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

Updated Date - 2023-01-15T20:09:55+05:30 IST