Nathan Lyon: భారత్‌పై సంచలన రికార్డు సాధించిన నాథన్ లయన్
ABN , First Publish Date - 2023-03-02T18:48:38+05:30 IST
భారత్(Team India)తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా(Australia) ఆఫ్ స్పిన్నర్ నాథన్
ఇండోర్: భారత్(Team India)తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా(Australia) ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ (Nathan Lyon)అదరగొట్టాడు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను బంతితో చీల్చిచెండాడాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్‌పై 8 వికెట్లు తీయడం ఇది రెండోసారి. రెండో ఇన్నింగ్స్‌లో 23.3 ఓవర్లు వేసిన లయన్.. 64 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఇండియాపై అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 35 ఏళ్ల నాథన్ లయన్ భారత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది తొమ్మిదోసారి. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) భారత్‌పై 8 సార్లు ఆ ఘనత సాధించగా ఇప్పుడా రికార్డును లయన్ బద్దలుగొట్టాడు.
కుంబ్లే రికార్డు కూడా..
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టిన నాథన్ లయన్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కూడా తన పేర లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో టీమిండియా బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే(Anil Kumble)111 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, లయన్ 112 వికెట్లతో కుంబ్లేను అధిగమించాడు. 57వ ఓవర్‌లో ఉమేశ్ యాదవ్(Umesh Yadav) వికెట్‌ను పడగొట్టడం ద్వారా లయన్ ఈ ఘనత సాధించాడు. లయన్, కుంబ్లే తర్వాతి స్థానాల్లో రవిచంద్రన్ అశ్విన్ (106), హర్భజన్ సింగ్ (95), రవీంద్ర జడేజా (84) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టెస్టుల్లో భారత్‌పై
టెస్టు క్రికెట్‌లో భారత్‌పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గానూ లయన్ రికార్డు సాధించాడు. శుభమన్ గిల్ వికెట్‌ను పడగొట్టడం ద్వారా శ్రీలంక లెజండ్ మురళీధరన్‌ను వెనక్కి నెట్టేశాడు. అంతేకాదు, షన్ వార్న్ తర్వాత అత్యంత విజయవంతమైన ఆసీస్ స్పిన్నర్ చరిత్ర సృష్టించాడు.