Share News

IND vs ENG: చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే..

ABN , Publish Date - Dec 16 , 2023 | 01:01 PM

IND-W vs ENG-W: ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత అమ్మాయిలు అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

IND vs ENG: చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే..

ముంబై: ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత అమ్మాయిలు అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండ్ షో తో అదరగొట్టిన మన అమ్మాయిలు మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించారు. ముఖ్యంగా మన స్పిన్నర్లను ఎదుర్కొలేక ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆ జట్టు ఒకసారి కూడా 150 పరుగుల మార్కు దాటలేకపోయింది. స్పిన్నర్ దీప్తి శర్మ (9/39) అయితే విశ్వరూపం చూపించింది. బ్యాటింగ్‌లోనూ దీప్తి శర్మ హాఫ్ సెంచరీతో రాణించింది. దీంతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిలు కలిసికట్టుగా అదరగొట్టారు. ధాటిగా ఆడి మొదటి రోజే 400కు పైగా పరుగులు సాధించి రికార్డు నెలకొల్పారు. శుభా సతీష్(69), జెమీమా రోడ్రిగ్స్ (68), దీప్తి శర్మ(67), యస్తిక భాటియా(66) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 49 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 428 పరుగుల భారీ స్కోర్ చేసింది.


భారత బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టు 136 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ దీప్తి శర్మ 5 వికెట్లతో చెలరేగింది. స్నేహ రాణా 2, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 292 పరుగుల భారీ అధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 186/6 వద్ద టీమిండియా స్కోర్‌ను డిక్లేర్ చేశారు. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ 44 పరుగులతో పర్వాలేదనిపించింది. మొదటి ఇన్నింగ్స్ అధిక్యాన్ని కలుపుకుని భారత జట్టుకు 478 పరుగుల భారీ అధిక్యం లభించింది. దీంతో ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టు ముందు టీమిండియా ఉమెన్స్ జట్టు 479 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య చేధనలో గెలుపు సంగతి పక్కన పెడితే మన బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ అమ్మాయిలు కనీసం పోరాటపటిమ కూడా చూపలేకపోయారు. 131 పరుగులకే కుప్పకూలారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4, పూజా వస్త్రాకర్ 3, రుతురాజ్ గైక్వాడ్ 2, రేణుక ఠాకూర్ సింగ్ ఒక వికెట్ తీశారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 9 వికెట్లు తీయడంతోపాటు బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ కూడా చేసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కింది.

Updated Date - Dec 16 , 2023 | 01:01 PM