Team India: షాకింగ్ న్యూస్.. ప్రపంచకప్‌లో షమీ ఇంజెక్షన్స్ తీసుకున్నాడట..!!
ABN , Publish Date - Dec 30 , 2023 | 02:48 PM
Team India: వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన షమీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చీలమండ గాయంతో బాధపడుతుండటంతో వన్డే ప్రపంచకప్ సమయంలోనూ షమీ ఇంజెక్షన్స్ సాయంతోనే బరిలోకి దిగాడని అతడి సన్నిహితుడు వెల్లడించాడు.
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తొలి నాలుగు మ్యాచ్‌లకు తీసుకోకపోయినా.. హార్దిక్ పాండ్య దూరం కావడంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్ నుంచి షమీని జట్టులోకి తీసుకున్నారు. దీంతో అతడు చెలరేగి బౌలింగ్ చేశాడు. 7 మ్యాచ్‌లలోనే 24 వికెట్లు సాధించాడు. రెండు మ్యాచ్‌లలో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అయితే షమీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చీలమండ గాయంతో బాధపడుతుండటంతో వన్డే ప్రపంచకప్ సమయంలోనూ షమీ ఇంజెక్షన్స్ సాయంతోనే బరిలోకి దిగాడని అతడి సన్నిహితుడు వెల్లడించాడు. టోర్నీ మొత్తం షమీ గాయం నొప్పిని భరించాడని.. ప్రతిరోజూ ఇంజెక్షన్స్ తీసుకున్నాడని.. వయసు పెరుగుతున్నా కొద్దీ గాయాలు నయం కావాలంటే చాలా సమయం పడుతోందని అతడు పేర్కొన్నాడు.
కాగా దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేసినా అతడు కోలుకోకపోవడంతో దూరమయ్యాడు. అయితే మహమ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతడి స్థానంలో మూడో పేసర్‌గా బరిలోకి దిగిన ప్రసిధ్ కృష్ణ తేలిపోయాడు. బుమ్రా, షమీ, ఇషాంత్, సిరాజ్‌లా యువ బౌలర్లు రాణించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో విఫలమైన ప్రసిధ్ కృష్ణపై వచ్చిన విమర్శలను రోహిత్ శర్మ తిప్పికొట్టాడు. ప్రసిధ్ కృష్ణకు టీమిండియా కెప్టెన్ అండగా నిలిచినా మాజీ బౌలర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసిధ్ కృష్ణ తేలిపోవడంతో మహ్మద్ షమీ స్థానంలో బీసీసీఐ అవేస ఖాన్‌ను ఎంపిక చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.