IND Vs AFG: సారీ చెప్పిన నవీన్ ఉల్ హక్.. చిరునవ్వులు చిందించిన కోహ్లీ
ABN , First Publish Date - 2023-10-11T20:53:08+05:30 IST
కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నవీన్ ఉల్ హక్ స్వయంగా వచ్చి అతడికి సారీ చెప్తూ తాను మీ ఫ్యాన్ అని.. గతంలో జరిగింది మరిచిపోవాలని చెప్పాడు. దీనికి కోహ్లీ చిరునవ్వులు చిందిస్తూ నవీన్ భుజం తట్టి ప్రోత్సహించాడు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్-ఆప్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో స్కోరు కంటే అభిమానులు ఆసక్తి చూపించింది మాత్రం ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్‌పైనే. ఈ ఆప్ఘనిస్తాన్ యువ పేసర్‌కు టీమిండియా ఫ్యాన్స్.. ముఖ్యంగా కోహ్లీ అభిమానులు చుక్కలు చూపించారు. నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు రాగానే అభిమానులు కోహ్లీ నామస్మరణ చేయడం ప్రారంభించారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. టీమిండియా బ్యాటింగ్ సమయంలో నవీన్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. దీంతో కామెంటేటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో సెటైర్లు కూడా వేశాడు. ఎందుకు కోహ్లీ నామస్మరణ జరుగుతుందో చెప్పగలరా అంటూ ప్రశ్నించాడు. అయితే సమాధానం చెప్పిన వాళ్లకు బహుమతులేమీ ఉండవని ఛమత్కారం వ్యక్తం చేశాడు. అయితే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నవీన్ ఉల్ హక్ స్వయంగా వచ్చి అతడికి సారీ చెప్తూ తాను మీ ఫ్యాన్ అని.. గతంలో జరిగింది మరిచిపోవాలని చెప్పాడు. దీనికి కోహ్లీ చిరునవ్వులు చిందిస్తూ నవీన్ భుజం తట్టి ప్రోత్సహించాడు. ఇవన్నీ ఆటలో భాగమే అన్నట్లు కోహ్లీ నవీన్‌కు చెప్పాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Team India: ఒకే దెబ్బకు మూడు పిట్టలు.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డులే రికార్డులు..!!
గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య వివాదం చోటు చేసుకుంది. లక్నో వేదికగా ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదంగా నిలిచిపోయింది. కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్ అంపైర్లకు ఫిర్యాదు చేయడం గొడవకు కారణమైంది. తాను పిచ్‌పైకి వెళ్లలేదని, కావాలంటే తన షూస్‌ను చూడవచ్చని, ఎలాంటి మట్టి లేదని కోహ్లీ కాలిని పైకెత్తాడు. ఈ క్రమంలోనే నవీన్ ఉల్ హక్‌ను కోహ్లీ మందలించాడు. దాంతో అందరూ కోహ్లీని అపార్ధం చేసుకున్నారు. కోహ్లీ- నవీన్ ఉల్ హక్ గొడవ కాస్త మ్యాచ్ అనంతరం గంభీర్-కోహ్లీ మధ్య వార్‌గా మారింది. దీంతో ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. ఈ వివాదం తర్వాత ఆప్ఘనిస్తాన్‌తో ఎప్పుడు టీమిండియా మ్యాచ్ ఆడినా కోహ్లీ అభిమానులు నవీన్ ఉల్ హక్‌ను ర్యాగింగ్ చేయడం, ట్రోల్ చేయడం చేస్తున్నారు. ఆసియా కప్‌లో కనిపించిన ఈ సెగ తాజాగా ప్రపంచకప్ వరకు పాకింది. ఈ నేపథ్యంలో నవీన్ వచ్చి కోహ్లీకి సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.