ODI World Cup 2023: న్యూజిలాండ్ బోణీ.. ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ
ABN , First Publish Date - 2023-10-05T20:51:50+05:30 IST
వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ సొంతం చేసుకుంది.
వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ డెవాన్ కాన్వే భారీ సెంచరీ చేశాడు. 121 బాల్స్‌లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ విల్ యంగ్ డకౌట్ అయినా.. రచిన్ రవీంద్ర కూడా సెంచరీతో తన సత్తా చాటడంతో న్యూజిలాండ్ స్కోరు వేగంగా పరుగులు తీసింది. రచిన్ రవీంద్ర 96 బాల్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 నాటౌట్‌తో న్యూజిలాండ్‌ను గెలిపించాడు. కాన్వే, రవీంద్ర కలిసి రెండో వికెట్‌కు అభేద్యంగా 273 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. శామ్ కరణ్ ఒక్కడే ఒక వికెట్ సాధించాడు. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
ఇది కూడా చదవండి: ODI World Cup: ప్రపంచకప్‌లో ఒక్క సెకన్ ప్రకటన ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్ పరిణితితో చెందిన ఇన్నింగ్స్ ఆడాడు. 86 బాల్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 77 పరుగులు చేశాడు. అయితే మిగతా వాళ్లు నిలకడగా ఆడలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లు సమష్టిగా రాణించారు. మ్యాట్ హెన్రీ 3 వికెట్లు, మిచెల్ శాంట్నర్ 2 వికెట్లతో ఇంగ్లండ్ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారు.