Rajashree Swain: అడవిలో ఆత్మహత్య చేసుకున్న మహిళా క్రికెటర్
ABN , First Publish Date - 2023-01-14T16:04:13+05:30 IST
దట్టమైన అడవిలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. బుధవారం (జనవరి 11) నుంచి కనిపించకుండా పోయిన రాజశ్రీ
భువనేశ్వర్: ఒడిశాకు చెందిన మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ (26) ఆత్మహత్య చేసుకుంది. కటక్‌లోని దట్టమైన అడవిలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. బుధవారం (జనవరి 11) నుంచి కనిపించకుండా పోయిన రాజశ్రీ (Rajashree Swain) స్కూటర్‌ను అడవికి సమీపంలో గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక కానీ ఆమె మరణానికి గల కారణం చెప్పలేమని డీసీపీ పినాక్ మిశ్రా తెలిపారు.
అసహజ మరణంగా కేసు నమోదు చేసుకునట్టు చెప్పిన పినాక్ మిశ్రా.. రాజశ్రీ మృతదేహాన్ని అథాగఢ్ ప్రాంతంలోని గురుడిఝాటియా(Gurudijhatia forest) అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతుండగా గుర్తించినట్టు చెప్పారు. ఆమె మరణంపై అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నట్టు తెలిపారు.
పాండిచ్చేరిలో త్వరలో జరగనున్న చాంపియన్‌షిప్ కోసం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ కటక్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. పూరి జిల్లాకు చెందిన రాజశ్రీ ఈ ట్రైనింగ్ సెషన్‌కు హాజరైంది. అయితే, టోర్నీ కోసం ఎంపిక చేసిన 16 మందితో కూడిన జట్టులో స్వైన్ చోటు సంపాదించుకోలేకపోయింది. ఆమె ఆత్మహత్యకు, దీనికి సంబంధం ఉంటుందని భావిస్తున్నారు.
జట్టును ప్రకటించిన తర్వాత అందులో తన పేరు లేకపోవడంతో బుధవారం సాయంత్రం రాజశ్రీ కన్నీళ్లు పెట్టుకున్నట్టు ఆమె రూమ్మేట్ ఒకరు చెప్పారు. ఆ తర్వాత ఆమె హోటల్ రూము నుంచి అదృశ్యమైనట్టు పేర్కొన్నారు. ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో కోచ్ పుష్పాంజలి బెనర్జీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇతర ప్లేయర్ల కంటే రాజశ్రీ మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ జట్టులో ఆమెకు చోటు దక్కలేదని సమాచారం. అయితే, జట్టు ఎంపిక విషయంలో ఎలాంటి పక్షపాతం చూపలేదని అసోసియేషన్ సీఈవో సుబ్రత్ బెహరా పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగి ఉంటే 25 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్ జట్టులో ఆమెకు చోటెలా దక్కేదని ప్రశ్నించారు. అయితే, రాజశ్రీ కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, కళ్లు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. కాగా, స్వైన్ రైటార్మ్ పేసర్, మిడిలార్డర్ బ్యాటర్.