Share News

Shoib Akthar: ఫైనల్‌కు ఇలాంటి పిచ్ వేస్తారా? టీమిండియా అలవాటు మార్చుకోవాలి..!!

ABN , First Publish Date - 2023-11-20T21:11:15+05:30 IST

ODI World Cup: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాపై ఓటమిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. టీమిండియా ఓటమికి ఒక రకంగా చెప్పుకోవాలంటే పిచ్ కారణమని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరుకున్న భారత్ అహ్మదాబాద్‌లో మెరుగైన పిచ్ రెడీ చేసుకోవాల్సిందని అక్తర్ అన్నాడు.

Shoib Akthar: ఫైనల్‌కు ఇలాంటి పిచ్ వేస్తారా? టీమిండియా అలవాటు మార్చుకోవాలి..!!

ఎంతో ఆసక్తి రేపిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలవ్వడం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసింది. పలువురు మాజీ క్రికెటర్లను కూడా ఈ ఓటమి ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. టీమిండియా ఓటమికి ఒక రకంగా చెప్పుకోవాలంటే పిచ్ కారణమని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరుకున్న భారత్ అహ్మదాబాద్‌లో మెరుగైన పిచ్ రెడీ చేసుకోవాల్సిందని అక్తర్ అన్నాడు. ఎందుకంటే భారత జట్టు అదృష్టంతో ఫైనల్ చేరలేదని.. అందరినీ ఆశ్చర్యపరిచేలా విజయాలు సాధించి ఫైనల్ చేరుకున్నారని గుర్తుచేశాడు. కానీ ఫైనల్ కోసం ఉపయోగించిన పిచ్ మాత్రం తనను పూర్తిగా నిరాశ పరిచిందన్నాడు.

పిచ్ కారణంగా టీమిండియా బ్యాటింగ్ నత్తనడకన సాగిందని.. ఆ జట్టు బ్యాటర్లు చాలా మెత్తపడిపోయి ఆడారని షోయబ్ అక్తర్ విశ్లేషించాడు. కానీ అలా కాకుండా ఎప్పటి తరహాలోనే ఎటాకింగ్ ఆట ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. పిచ్ నుంచి మరికొంత పేస్, బౌన్స్ లభిస్తే అసలు టాస్ పెద్దగా ప్రభావమే చూపించేది కాదని అక్తర్ చెప్పుకొచ్చాడు. దురదృష్టం ఏంటంటే గత కొన్నేళ్లుగా పెద్ద మ్యాచ్‌లలో భారత్ తడబడుతూనే ఉందని అక్తర్ పేర్కొన్నాడు. టీమిండియా ఆటగాళ్లు ఈ అలవాటు మార్చుకోవాలని హితవు పలికాడు. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో భారత్ తడబడింది. బ్యాటింగ్ విభాగం తడబాటుతో బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు కంగారూల చేతిలో ఓడి మూడో వరల్డ్ కప్‌ను ముద్దాడాలన్న ఆశలను చేజార్చుకుంది. ఫైనల్ లాంటి మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో కాకుండా ముంబై లేదా కోల్‌కతాలో నిర్వహించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-20T21:11:16+05:30 IST