Share News

Rahul Dravid: తండ్రికి తగ్గ తనయుడు.. కర్ణాటకను ఒంటి చేతితో గెలిపించిన రాహుల్ ద్రావిడ్ కొడుకు

ABN , Publish Date - Dec 21 , 2023 | 01:16 PM

Samit Dravid: రాహుల్ ద్రావిడ్. క్రికెట్ గురించి తెలిసిన వారికి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఆటగాడిగా టీమిండియాకు చాలా విజయాలు అందించాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు.

Rahul Dravid: తండ్రికి తగ్గ తనయుడు.. కర్ణాటకను ఒంటి చేతితో గెలిపించిన రాహుల్ ద్రావిడ్ కొడుకు

రాహుల్ ద్రావిడ్. క్రికెట్ గురించి తెలిసిన వారికి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఆటగాడిగా టీమిండియాకు చాలా విజయాలు అందించాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. ది వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆటగాడిగా జట్టు కోసం టన్నుల కొద్దీ పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్ రిటైరయ్యాక కోచ్‌గా సేవలందిస్తున్నాడు. తన కోచింగ్‌లో గతంలో టీమిండియా జూనియర్ జట్టును తీర్చిదిద్దిన ద్రావిడ్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ద్రావిడ్ కోచింగ్‌లో భారత జట్టు ప్రపంచకప్ ట్రోఫీని గెలవలేదనే పేరే కానీ మిగతా అన్నింటా మంచి విజయాలు సాధించింది. దీంతో ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌తోనే రాహుల్ ద్రావిడ్ రెండేళ్ల పదవి కాలంగా ముగిసినప్పటికీ ఆయన కాంట్రాక్టును బీసీసీఐ మరింత కాలం పొడిగించింది.


రాహుల్ ద్రావిడే కాదు ఆయన కొడుకు సమిత్ ద్రావిడ్ కూడా క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. 18 ఏళ్ల సమిత్ ద్రావిడ్ కూచ్ బెహార్ ట్రోఫీలో చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో కర్నాటక తరఫున ఆడుతున్న సమిత్ జమ్మూకశ్మీర్‌తో మ్యాచ్‌లో చెలరేగాడు. 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 159 బంతుల్లో 98 పరుగులు చేసి కర్ణాటక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సమిత్ ఆడిన షాట్లు అతని తండ్రి రాహుల్ ద్రావిడ్‌ను గుర్తు చేశాయి. తండ్రి లాగే ఆడిన ఫ్రంట్ ఫుట్ షాట్లు, కవర్ డ్రైవ్‌లు ఆకట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో బాల్‌తోనూ సత్తా చాటిన సమిత్ 3 వికెట్లు తీశాడు. మొత్తంగా ఆల్ రౌండ్ షోతో కర్ణాటకను ఒంటి చేతితో గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్‌పై కర్ణాటక ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇటీవల ఖాళీ సమయంలో కూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరిగిన కర్ణాటక మ్యాచ్‌కు రాహుల్ ద్రావిడ్ హాజరయ్యాడు. అక్కడ కొడుకు సమిత్ ఆటను చూసి మురిసిపోయాడు. కాగా సమిత్ ద్రావిడ్ ప్రతిభను చూసిన పలువురు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్‌లో తండ్రిలా మంచి క్రికెటర్ అవుతాడని కొనియాడుతున్నారు.

Updated Date - Dec 21 , 2023 | 01:16 PM