IND Vs AUS: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే రద్దు..?
ABN , First Publish Date - 2023-09-23T16:22:50+05:30 IST
ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆట జరిగే ఆదివారం రోజు ఇండోర్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
టీమిండియా వరుస విజయాలతో జోరు మీద ఉంది. కీలక ఆటగాళ్లు దూరమైనా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ మేరకు ఇండోర్‌లో జరిగే రెండో వన్డేలో కూడా గెలిచి మూడు వన్డేల సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే భారత్ జోరుకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆట జరిగే ఆదివారం రోజు ఇండోర్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అభిప్రాయపడింది. తొలి వన్డే జరిగిన మొహాలీలో కూడా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో కాసేపు వర్షం కురవడంతో పావుగంట సేపు మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: Team India: మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్.. చరిత్రలో రెండో జట్టుగా రికార్డు
అటు ఆసియా కప్‌లోనూ వర్షం వల్ల పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దయ్యింది. ఆ తర్వాత సూపర్-4లో వర్షం కారణంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజు నిర్వహించారు. శ్రీలంకలోనే కాకుండా ఇప్పుడు భారత్‌లో జరిగే మ్యాచ్‌లను కూడా వరుణుడు అడ్డుకోవాలని చూస్తున్నాడని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు రెండో వన్డే సజావుగా జరిగితే టీమిండియా జట్టులో కొన్ని మార్పులు చేయాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదో స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఉండగా.. ఇషాన్ కిషన్ కేవలం మిడిలార్డర్ బ్యాటర్‌గా ఆడుతున్నాడు. కాబట్టి అతడి స్థానంలో తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని ద్రవిడ్ అండ్ కో అనుకుంటున్నట్లు తెలుస్తోంది.