IND Vs IRE: బుమ్రా రీ ఎంట్రీకి వరుణుడి ఆటంకం.. తొలి మ్యాచ్ జరిగేనా?
ABN , First Publish Date - 2023-08-18T15:17:05+05:30 IST
టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా రీ ఎంట్రీకి వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్ జరగనున్న డబ్లిన్‌లో శుక్రవారం భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 92 శాతం వర్షం పడుతుందని నివేదిక ఇచ్చింది. దీంతో ఇప్పటికే ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఈరోజు నుంచి ఐర్లాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. వెన్నునొప్పి కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న బుమ్రా 14 నెలల తర్వాత మైదానంలో దిగేందుకు రెడీ అయ్యాడు. అయితే అతడి రీ ఎంట్రీకి వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్ జరగనున్న డబ్లిన్‌లో శుక్రవారం భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 92 శాతం వర్షం పడుతుందని నివేదిక ఇచ్చింది. దీంతో ఇప్పటికే ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లను దృష్టిలో పెట్టుకుని ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ నుంచి ప్రధాన ఆటగాళ్లకు టీమిండియా సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. దీంతో యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అదరగొట్టిన రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మ లాంటి ఆటగాళ్లు సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రాణించిన తిలక్ వర్మ, యషస్వీ జైశ్వాల్ ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ తమ ప్రదర్శన కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. వెస్టిండీస్ సిరీస్‌లో విఫలమైన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. స్పిన్ కోటాలో రవి బిష్ణోయ్‌తో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఆడే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: Virat Kohli: కింగ్ కోహ్లీ కెరీర్‌కు 15 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడింది ఈరోజే..!!
కాగా ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ కూడా డబ్లిన్‌లోనే జరగనుంది. అయితే ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌కు వరుణుడి వల్ల ఇబ్బంది ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం డబ్లిన్‌లో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. మరి శుక్రవారం తొలి టీ20 జరుగుతుందా.. లేదా వర్షార్పణం అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ మ్యాచ్‌ను రిలయన్స్ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ 18, జియో సినిమా ప్రసారం చేయనున్నాయి. వాతావరణం సహకరిస్తే రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.